ముదిగొండ, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో ఏండ్లుగా సిద్ధమవుతున్నా నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయని ఓ నిరుద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణు శనివారం నిద్ర మాత్రలు మింగాడు. నోటిఫికేషన్లు సకాలంలో రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయానంటూ సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.
సూసైడ్ నోట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమై పరీక్షలు రాశానని తెలిపాడు. ఉద్యోగం దక్కకపోవడం, వెంటవెంటనే నోటిఫికేషన్లు రాకపోవడం, ప్రభుత్వ నియామక ప్రక్రియల్లో జాప్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లి అనారోగ్యం, అక్క ఆరోగ్య సమస్యలు తనను తీవ్ర నిరాశకు గురి చేశాయని పేర్కొన్నాడు.
తన పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించాలని, సీఎం, డిప్యూటీ సీఎం స్పందించి నిరుద్యోగుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని లేఖలో విజ్ఞప్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను స్పీడప్ చేయాలని కోరాడు. ప్రస్తుతం వేణు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు తెలిపినట్లు బంధువులు చెప్పారు.
