వరల్డ్‌కప్ అమ్మకం ప్లాన్‌పై ట్రంప్ బిగ్ కామెంట్స్.. ఫుట్‌బాల్‌లో మరో రచ్చ! 

వరల్డ్‌కప్ అమ్మకం ప్లాన్‌పై ట్రంప్ బిగ్ కామెంట్స్.. ఫుట్‌బాల్‌లో మరో రచ్చ! 

Donald Trump: ఫుట్‌బాల్ ప్రపంచకప్ (FIFA World Cup) వాటాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించేందుకు ఫిఫా (FIFA) వేసిన వ్యూహం తీవ్ర వివాదాస్పదమై చివరకు రద్దయింది. ఈ వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా వినిపించడంతో ఆయన స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో నేతృత్వంలో ఫిఫా ఫార్వర్డ్ ఎంటర్‌ప్రైజ్ (FFE) పేరుతో ఒక కొత్త ప్రణాళికను రూపొందించారు. వరల్డ్ కప్‌లోని వాణిజ్య హక్కుల్లో 21 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించి, ఆ నిధులతో 211 సభ్య దేశాలకు ఆర్థిక సాయం పెంచుతామని ఫిఫా పేర్కొంది.

డొనాల్డ్ ట్రంప్ లింక్.. మౌనం వీడిన అమెరికా అధ్యక్షుడు: 
ఫుట్‌బాల్‌ను వ్యాపారీకరించే ఈ నిర్ణయంపై యుఈఎఫ్ఏ (UEFA), కాన్మెబోల్ (CONMEBOL), ఏఎఫ్‌సీ (AFC) లాంటి ప్రధాన ఖండాల ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫిఫా ఈవెంట్లను బహిష్కరిస్తామని (Boycott) హెచ్చరించాయి. కాగా వరల్డ్ కప్ వాటాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన థ్రైవ్ ఎటర్నల్ అనే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ వెనుక డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సోదరుడు జోషువా కుష్నర్ ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ ప్లాన్‌లో ట్రంప్ ప్రమేయం ఉందనే ఊహాగానాలు బయలుదేరాయి.

ప్రాజెక్ట్‌ను రద్దు చేసిన ఫిఫా: 
డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. నాకు ఈ ప్లాన్‌తో ఎలాంటి సంబంధం లేదు.. ఈ కొత్త ప్రతిపాదన గురించి నేను ఇన్ఫాంటినోతో ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో వెనక్కి తగ్గారు. ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేస్తున్నట్లు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఫుట్‌బాల్ వర్గాల్లో విభేదాలు: 
నిధులు లేని పేద దేశాలకు సహాయం చేయడానికే ఈ ప్లాన్ తెచ్చామని, అయితే ఇది ఫుట్‌బాల్ వర్గాల్లో విభేదాలకు దారితీసినందున ప్రణాళికను విరమించుకుంటున్నామని ఫిఫా చీఫ్ జియాన్ తెలిపారు. ఫిఫా ఈ ప్లాన్‌ను రద్దు చేసినప్పటికీ, యుఈఎఫ్ఏ (UEFA) మాత్రం ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినోపై తమకు నమ్మకం పోయిందని (Lost Confidence) సంచలన ప్రకటన విడుదల చేయడంతో ఫుట్‌బాల్ లీడర్‌షిప్‌లో ఉత్కంఠ నెలకొంది.