T20 World Cup: నిస్సాంక విధ్వంసం.. శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా ఘోర ఓటమి

T20 World Cup: నిస్సాంక విధ్వంసం.. శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా ఘోర ఓటమి

టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియాకు మరో ఓటమి ఎదురైంది. గ్రూప్ దశలో పసికూన జింబాబ్వే చేతిలో ఓటమి పాలై షాక్‎లో ఉన్న ఆస్ట్రేలియాకు తాజాగా శ్రీలంక ఝలక్ ఇచ్చింది. సోమవారం (ఫిబ్రవరి 16) పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియాపై అతిథ్య శ్రీలంక ఘన విజయం సాధించింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (100) సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక 8 వికెట్ల తేడాతో కంగారులను చిత్తుచేసింది.

తద్వారా టీ20 వరల్డ్ కప్‎లో శ్రీలంక సూపర్ 8 రౌండ్‎కు అర్హత సాధించింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని మరో 12 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక ఛేధించింది. సెంచరీతో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన నిస్సాంక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెల్చుకున్నాడు. గ్రూప్ దశలో రెండు ఓటములతో సూపర్ 8 ఆశలను ఆస్ట్రేలియా సంక్లిష్టం చేసుకుంది. 

నిస్సాంక ధనాధన్ ఇన్సింగ్స్:

182 పరుగుల భారీ లక్ష్యంతో ఛేధనకు దిగిన శ్రీలంకకు సరైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కుశాల్ పెరీరా తీవ్రంగా నిరాశ పర్చాడు. కేవలం ఒక్క రన్ మాత్రమే చేసి స్టోయినిస్ బౌలింగ్‎లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అయినప్పటికీ మరో ఓపెనర్ నిస్సాంక తగ్గలేదు. కుశాల్ మెండిస్‎తో కలిసి ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ దశలో (51) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కుశాల్ మెండిస్ స్టోయినిస్ బౌలింగ్‎లో కీపర్ కాన్లీకి చిక్కాడు. అనంతరం పవన్ రాత్నాయక్ (28),  నిస్సాంక (100) శ్రీలంకను విజయ తీరాలకు చేర్చారు.

స్టార్టింగ్ ఫటాఫట్.. తర్వాత డీలా:

ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56) హాఫ్ సెంచరీలతో విజృంభించారు. భారీ స్కోర్ దిశగా సాగుతోన్న ఆస్ట్రేలియాను దుషన్ హేమంత దెబ్బకొట్టాడు. వెను వెంటనే మార్ష్, హెడ్‎ను ఔట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. 

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్ (3), టిమ్ డేవిడ్ (6) తీవ్రంగా నిరాశపర్చారు. ఈ క్రమంలో ఇంగ్లీస్ (27), మ్యాక్స్ వెల్ (22) ఆదుకున్నారు. మొదట్లో ధారళంగా రన్స్ ఇచ్చిన శ్రీలంక బౌలర్లు  చివర్లో పుంజుకుని ఆస్ట్రేలియాను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు.  శ్రీలంక బౌలర్లలో దుషన్ హేమంత మూడు వికెట్లు తీశాడు. చమీర 2 వికెట్లు పడగొట్టగా.. వెల్లలాగే, మహేష్ తీక్షణ, కమిందు మెండిస్ తలో వికెట్ సాధించారు.