- 6 రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన యువ డాక్టర్
- అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల/అయిజ, వెలుగు: మెడికో ప్రియాంక (28)కు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్‌లోని వ్యవసాయ పొలంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఏపీలోని రాజమండ్రిలో జరిగిన యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం సికింద్రాబాద్ కిమ్స్‌లో ఆమె చనిపోయారు. అనంతరం ప్రియాంక డెడ్‌బాడీకి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, సొంతూరు అయిజ మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి తరలించారు.
ప్రియాంక అంత్యక్రియలు నేపథ్యంలో ఆమెను కడసారి చూసేందుకు పరిసర ప్రాంత ప్రజలు, రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయిజలో నిర్వహించిన అంతిమయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన కనికె వెంకటేశ్, చంద్రకళ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక.. రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగం పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 3న రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్యమాల్‌లో సినిమా చూసి, తన క్లాస్‌మెట్‌తో కలిసి స్కూటీపై వెళ్తున్నారు.
ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న యువకులు వేగంగా కారుతో వచ్చి, వీరి వెహికల్‌ను ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్రంగా గాయపడింది. స్థానికంగా ఆమెకు ట్రీట్‌మెంట్ అందించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో 6 రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది.
ఉద్దేశపూర్వకంగా హత్య..
మద్యం మత్తులో ఉన్న యువకులు తన కుమార్తెను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీ కొట్టి, చంపేశారని ప్రియాంక తండ్రి వెంకటేశ్ కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె మృతికి కారకులైన దోషులను ఉరి తీయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని అఖిలపక్ష కమిటీ నాయకులు వెంకట్రాములు, ఆంజనేయులు, విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రియాంక అంతిమయాత్రలో పాల్గొన్న అనంతరం వారు అయిజ పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రియాంక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు.
ప్రియాంకది యాక్సిడెంట్ కాదని, తాగిన మైకంలో హత్య చేశారన్నారు. యాక్సిడెంట్ చేసిన వారిపై మర్డర్ కేసు పెట్టి ఉరిశిక్ష వేయాలని, ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. కాగా, గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఏపీలోని రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రియాంక భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ప్రియాంక కుటుంబానికి న్యాయం చేస్తం: ఏపీ మంత్రి భరత్
ప్రియాంక ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని ఆ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం ఎక్లాస్‌పూర్‌లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన.. ప్రియాంక కుటుంబ సభ్యులకు పరామర్శించి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. ప్రియాంక కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్నారు.
