- పలువురు నాయకుల అరెస్ట్
- కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాల ఆందోళన
- 4 లేబర్ కోడ్స్, విద్యుత్, విత్తన బిల్లులను రద్దు చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), వివిధ కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్‌భవన్ వైపు ర్యాలీగా వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పంజాగుట్ట, అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలి..
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ రైతు, కార్మిక వర్గాల పొట్టగొడుతోందని ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, పశ్య పద్మ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్తంగా పోరాడుతామని హెచ్చరించారు. కార్మికులకు ఉరితాళ్లుగా మారిన 4 లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భారత్–అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతోపాటు అన్ని రకాల ఎఫ్‌టీఏలను రద్దు చేయాలన్నారు.
రైతులు, కూలీల ఆత్మహత్యలను నివారించేందుకు సమగ్ర రుణమాఫీ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో రోజువారీ వేతనం రూ.700 చెల్లిస్తూ, ఏడాదికి పనిదినాలను 200 రోజులకు పెంచాలన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు–2025, విత్తన బిల్లు–2025లను ఉపసంహరించుకోవాలని, బలవంతపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాలడుగు భాస్కర్, బాల్‌రాజ్, రాంబాబు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
