హైదరాబాద్‌‌‌‌ - బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌‌‌‌కు ప్రాధాన్యమివ్వాలి

హైదరాబాద్‌‌‌‌ - బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌‌‌‌కు ప్రాధాన్యమివ్వాలి
  •     రక్షణ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌కు జితేందర్ రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌–బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్‌‌‌‌గా అధికారికంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. సమావేశంలో జితేందర్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు కూడా పాల్గొన్నారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో... సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే చేసిన విజ్ఞప్తిని జితేందర్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన డిఫెన్స్ కారిడార్లతో సమానంగా హైదరాబాద్-–బెంగళూరు కారిడార్‌‌‌‌కు కూడా తగిన ప్రాధాన్యం, ప్రోత్సాహం కల్పించాలని రక్షణ మంత్రిని కోరారు.

ఎగుమతుల్లో 100 శాతం వృద్ధి నమోదు

2025–26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ ఎగుమతులు ఏకంగా 100 శాతం వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర మంత్రికి జితేందర్ రెడ్డి వివరించారు. ప్రతిపాదిత కారిడార్‌‌‌‌ను అధికారికంగా ప్రకటించడం ద్వారా స్వదేశీ రక్షణ ఉత్పత్తి వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కార్యకలాపాలు వేగవంతమవుతాయన్నారు. దేశంలోని అతిపెద్ద ఏరోస్పేస్, రక్షణ రంగ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటని ఆయన గుర్తుచేశారు. నగర చుట్టుపక్కల డజనుకు పైగా ప్రధాన రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక డీఆర్‌‌‌‌డీఓ ప్రయోగశాలలతోపాటు 1,500కు పైగా ఏరోస్పేస్, రక్షణ రంగ ఎంఎస్‌‌‌‌ఎంఈలు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 

ఇవి దేశ రక్షణ సన్నద్ధతకు, ప్రధాన నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మక ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి గణనీయమైన తోడ్పాటునందిస్తున్నాయని పేర్కొన్నారు.తెలంగాణ ప్రతినిధి బృందం చేసిన ఈ విజ్ఞప్తిపై రాజ్‌‌‌‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు జితేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రక్షణ మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.