ప్రతిఒక్కరూ దేశభక్తిని చాటాలి

ప్రతిఒక్కరూ దేశభక్తిని చాటాలి
  • కిషన్ రెడ్డి, బండి సంజయ్ పిలుపు
  •     తమ ఇండ్లపై జాతీయ జెండా ఎగురవేసిన కేంద్ర మంత్రులు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని తమ ఇండ్లపై మంత్రులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ జెండా మన ఐక్యత, అఖండతకు ప్రతీక అని, ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ ఒక గొప్ప వేడుకలా నిర్వహించాలని సూచించారు. 

కుల, మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ తిరంగా యాత్రలు నిర్వహించి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 12 నుంచి 14 వరకు స్వాతంత్ర్య సమరయోధులు, మహాపురుషుల విగ్రహాలను శుద్ధి చేసి, స్మారక చిహ్నాల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కార్యక్రమం ఒక సామాజిక ఉద్యమంలా మారిందని తెలిపారు. ప్రతి కూడలిలో దేశభక్తి ప్రదర్శనలు నిర్వహించి, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.