కొలంబియాలో భూకంపం.. 111 మంది మృతి

కొలంబియాలో భూకంపం.. 111 మంది మృతి

కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4గా నమోదైంది. భూకంపం వల్ల ఇప్పటిదాకా 111 మంది ప్రాణాలు కోల్పోయారు. పెరీరా, కాలి, క్యుబ్డో నగరాల్లో డజన్ల కొద్దీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.

బొగోటా: కొలంబియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4 పాయింట్లుగా నమోదైంది. భూకంపం వల్ల ఇప్పటి వరకు 79 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బొగోటాకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో ఏరియాలోని ‘శాన్ జోస్ డెల్ పాల్మార్’ భూకంపానికి కేంద్ర స్థానమని అధికారులు తెలిపారు. 

భూగర్భంలో 107 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భారీ భూకంపం కారణంగా పెరీరా, కాలి, క్యుబ్డో నగరాల్లో డజన్ల కొద్దీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. వాటిలో నివసిస్తున్న వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు.

మానిజాలెస్ నగరంలో ఒక చారిత్రక కేథడ్రల్ టవర్ నేలమట్టమైంది. పెరీరా, మానిజాలెస్, క్యుబ్డో, ఆర్మేనియా, కార్టాగో, బ్యూనెవెంతురా నగరాల్లోని 6 విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి.  శిథిలాల తొలగింపు పనులు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కేవలం పెరీరా పట్టణంలోనే 18 మంది మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. విపత్తుపై కొలంబియా కొత్త అధ్యక్షుడు అబెల్లార్డో డి లా ఎస్ప్రియెల్లా స్పందించారు. సహాయక చర్యల బాధ్యతను ఆయన పర్యవేక్షిస్తున్నారు.