కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం

కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం

సిద్ధిపేట: కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామిక్షేత్రంలో జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత కీలక ఘట్టమైన పెద్దపట్నం వేడుకలను  ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించు కుని ఆలయ గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అర్థరాత్రి 1.30 గంటలకు సుమారు 150 మంది ఓగ్గు పూజారుల ఆధ్వర్యంలో తోటబావి వద్ద పెద్దపట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఇందు కోసం క్వింటళ్ల కొద్ది పసుపు, కుంకుమ, తెల్లపిండి. పచ్చ, గులాలు వినియోగించి పంచవర్ణాల తో 41 వరుసల పెద్దపట్నం వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ గర్భగుడిలోని స్వామివారి ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఊరేగింపుతో తోటబావి వద్దకు చేర్చారు. అక్కడ పంచవర్ణాలతో వున్న పెద్ద పట్నంపై విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపట్నంను ముందుగా ఉత్సవ విగ్రహాలతో అర్చకులు దాటగా అనంతరం భక్తులు దాటి మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భం గా ఆలయ ప్రాంగణం, తోటబావి ప్రాంగణం మల్లన్న నామస్మరణంతో మారుమరోగాయి. సుమారు 50 వేల మంది భక్తులు వేడుకలనుతిలకించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

స్వల్ప లాఠీ ఛార్జ్

పెద్దపట్నం దాటే సమయంలో భక్తులు నాలుగు వైపుల నుంచి భారీ గేట్లు ఎక్కి వచ్చేందుకు ప్ర యత్నించారు. దీంతో వారిని నిలువరించేందు కు పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. భక్తులు ఎదురుగా దూసుకు రావడంతో భారీకేడ్లు విరిగి ఫైర్ డిపార్ట్ మెంట్కు చెందిన కానిస్టేబుల్ కాలుకు గాయం కాగా అతడిని వెంటనే దవా ఖానకు తరలించారు.