భారత్ వైపు చూస్తున్న ప్రపంచం: 13 దేశాలు, 2.5 లక్షల మందితో ఢిల్లీలో మొదలైన ఏఐ సమ్మిట్...

భారత్ వైపు చూస్తున్న ప్రపంచం: 13 దేశాలు, 2.5 లక్షల మందితో ఢిల్లీలో మొదలైన ఏఐ సమ్మిట్...

ఢిల్లీ వేదికగా ఏఐ విశ్వరూపం మొదలైంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026  ఇవాళ్టి(ఫిబ్రవరి 16) నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్నారు. ఏఐ విధాన రూపకల్పన, సాంకేతిక ఆవిష్కరణలు, విస్తృత అమలు ప్రక్రియలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఎక్స్పోను రూపొందించారు. మొత్తం 10 అరేనాల్లో, 70 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం సాగనుంది. గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు, స్టార్టప్ లు, అకడమిక్, రిసెర్చ్ సంస్థలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములు ఇందులో పాల్గొంటున్నారు. 

పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్' అనే మూడు థీముల కింద 300కు పైగా ప్రదర్శన పెవిలియన్లు, ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోకు దేశ విదేశాల నుంచి 2.5 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఏఐ రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాలు, పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ఎక్సోపోలో మొత్తం 500కు పైగా సెషన్లు నిర్వహించనున్నారు. వీటిలో 3,250 మందికి పైగా వక్తలు, ప్యానెలిస్టులు పాల్గొంటారు. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్తో పాటు ఆఫ్రికా దేశాల భాగస్వామ్యంతో 13 దేశాల పావిలియన్లు ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ సహకారానికి ఈ ఎక్స్పో వేదికగా నిలవనుంది.

జనరేటివ్ ఏఐతో విద్యుత్, నీటి వనరులపై ఒత్తిడి


జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేక రంగాల్లో భారీ మార్పులకు దారి తీయనుందని నిపుణులు చెబుతున్నారు. సాఫ్ట్ వేర్  డెవలప్మెంట్, తయారీ, సంగీతం, సినిమా ఉత్పత్తి రంగాలతో పాటు, భారత్ లో పెద్ద ఎత్తున ఉన్న కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ సపోర్ట్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏఐ అసిస్టెంట్ టూల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ కంపెనీల షేర్లు ఇటీవల పడిపోయాయి. సమ్మిట్ వర్కింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం, ఆటోమేషన్ వల్ల సాధారణ పనులు యంత్రాల చేతికి వెళ్లిపోతున్నాయి. 

దీంతో కొంతమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉండగా, ఉత్పాదకత పెరిగినా సామాజిక, ఆర్ధిక అసమానతలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది. ఇక ఏఐ మౌలిక వసతుల కోసం పెద్ద టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అధునాతన మైక్రోచిప్లతో డేటా సెంటర్లు నిర్మిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో అణు విద్యుత్ ఆధారిత శక్తినీ ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ ఇందన సంస్థ ప్రకారం, ఏఐ విస్తరణ కారణంగా డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 2030 నాటికి రెండింతలు కావచ్చు. 2024లో ఇవి ప్రపంచ విద్యుత్ వినియోగంలో సుమారు 1.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. డేటా సెంటర్ల సర్వర్లను చల్లబెట్టేందుకు భారీగా నీరు అవసరమవుతోంది. తీవ్ర ఉష్ణోగ్రతల సమయంలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ అభివృద్ధి లాభాలతో పాటు, ఉద్యోగాలు, వనరులపై ప్రభావాలను సమతుల్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.