- బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో ‘షాడో బాక్సింగ్’ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఉద్దేశపూర్వకంగా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తూ జీఆర్‌ఎంబీ (గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్) పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణకు చెందిన కాళేశ్వరం, సీతారామ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి, ముక్తేశ్వరం, మోడికుంట వాగు, కడెం, గూడెం ప్రాజెక్టులకు జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ద్వారా అనుమతులిచ్చిందని గుర్తుచేశారు. జలశక్తి శాఖలో జీఆర్‌ఎంబీ చిన్న విభాగం మాత్రమేనని, టీఏసీ పర్మిషన్ ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేసే అధికారం ఆ బోర్డుకు లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను రద్దు చేస్తున్నారంటూ కేటీఆర్ చిట్‌చాట్ పేరిట అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
