హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం మండలస్థాయికి విస్తరిస్తోంది. ఈ నెల 17 నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణపై ఎంపీడీవోలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 13న హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన ఎంపీడీవోలకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజావాణి నిర్వహణ విధివిధానాలు, అధికారుల బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పీఆర్ఆర్డీ కమిషనర్ దివ్య దేవరాజన్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
