లాఠీచార్జ్‌‌‌‌పై చర్చకు ఓకే.. సభలో అమిత్ షా ప్రకటన చేస్తారన్న కిరణ్ రిజిజు

లాఠీచార్జ్‌‌‌‌పై చర్చకు ఓకే.. సభలో అమిత్ షా ప్రకటన చేస్తారన్న కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనపై ప్రతిపక్షాల డిమాండ్‌‌‌‌కు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల సమస్యలు, వారిపై పోలీసుల లాఠీచార్జ్‌‌‌‌పై లోక్‌‌‌‌సభలో చర్చకు అంగీకరించింది. ఈ చర్చలో హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోమవారం సభలో ప్రకటించారు. మూడు వారాలుగా కొనసాగుతున్న పార్లమెంట్ ప్రతిష్టంభనకు తెరపడేలా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. విద్యార్థుల సమస్యలపై కేవలం ప్రకటన కాకుండా పూర్తిస్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నామని రిజిజు చెప్పారు. 

ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికీ ప్రభుత్వం సమాధానం ఇస్తుందని తెలిపారు. చర్చ, హోంమంత్రి సమాధానం సమయంలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం చేయొద్దని కోరారు. అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు సభ నుంచి వాకౌట్ చేయకుండా ఆయన సమాధానాన్ని ప్రశాంతంగా వినాలని కాంగ్రెస్‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి జూన్ 20న ఢిల్లీలో జరిగిన ఆందోళనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

సభలో ఆగని నినాదాలు

ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా సభలో ఆందోళనలు ఆగలేదు. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వెల్‌‌‌‌లోకి వచ్చి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం కొనసాగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కూడా పార్టీల ఫ్లోర్ లీడర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజల గొంతు వినిపించేందుకు సభ సజావుగా నడవనివ్వాలని కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ చైర్‌‌‌‌లో ఉన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షం డిమాండ్‌‌‌‌ను అంగీకరించిందని ఆయన చెప్పారు. ఇక సభను సజావుగా నడిపేందుకు సహకరించాలని కోరారు. గత మూడు వారాలుగా సభ స్తంభించిపోవడానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.

చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం

ప్రతిపక్షాల నినాదాల మధ్యే న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు-2026ను లోక్‌‌‌‌సభలో ప్రవేశపెట్టారు. వివిధ ట్రిబ్యునళ్ల చైర్‌‌‌‌పర్సన్లు, సభ్యుల ఎంపిక కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం బిల్లులో ప్రధాన ఉద్దేశం. నియామకాల్లో ట్రాన్స్‌‌‌‌పరెన్సీ, యూనిఫామ్, ఇండిపెడెన్సీ తీసుకొచ్చి ట్రిబ్యునళ్ల పనితీరును మెరుగుపరచనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. 

2015 నుంచి ట్రిబ్యునల్ వ్యవస్థను క్రమబద్ధీకరించే చర్యలు చేపడుతున్నామని మేఘ్వాల్ తెలిపారు. ట్రిబ్యునళ్లలో చైర్‌‌‌‌పర్సన్లు, సభ్యుల నియామకానికి వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. అయితే విపక్ష సభ్యుల నినాదాల మధ్య బిల్లుపై చర్చ జరగకుండానే లోక్‌‌‌‌సభ ఆమోదించింది. అనంతరం సభను వాయిదా వేశారు. 

పార్లమెంటు సమావేశాలు ముగియడానికి ఇంకా నాలుగు రోజులే ఉండటంతో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్​, ఎఫ్‌‌‌‌సీఆర్‌‌‌‌ఏ తదితర కీలక బిల్లులపై ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్ తమ ఎంపీలకు ఆగస్టు 10, 11, 12 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరుకావాలని విప్ జారీ చేసింది.