AI అదుపుతప్పకుండా కొత్త హార్డ్‌వేర్ తెచ్చిన ఎన్వీడియా.. గీతదాటితే సెకన్లలో బ్రేకులే!

AI అదుపుతప్పకుండా కొత్త హార్డ్‌వేర్ తెచ్చిన ఎన్వీడియా.. గీతదాటితే సెకన్లలో బ్రేకులే!

ఏఐ సేఫ్టీని మరింత కట్టుదిట్టం చేసేందుకు చిప్ తయారీ దిగ్గజం ఎన్వీడియా కీలక ముందడుగు వేసింది. ఏఐ ఏజెంట్లు అదుపుతప్పకుండా, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా అడ్డుకునేందుకు రెండు లేయర్‌లతో కూడిన సరికొత్త ఏఐ భద్రతా వ్యవస్థను ఆవిష్కరించింది. ఇటీవల ఓపెన్ఏఐ మోడల్స్ కారణంగా 'హగ్గింగ్ ఫేస్' ప్లాట్‌ఫారమ్‌లో జరిగిన ఉల్లంఘనలను ఈ కొత్త టెక్నాలజీతో అడ్డుకోవచ్చని ఎన్వీడియా అంటోంది. ఏఐ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా.. భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించారు.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ.. అటానమస్ ఏజెంట్ల ప్రవర్తనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఓపెన్ఏఐ మోడల్స్ సురక్షితమైన టెస్టింగ్ వాతావరణం నుంచి బయటకు తప్పించుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం, అలాగే అమెరికా యూనివర్సిటీల వెబ్‌సైట్లలోకి చొరబడిన సంఘటనలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఏఐ భద్రత అనేది కొత్త చట్టాలు లేదా నిబంధనల ద్వారా కాకుండా, కేవలం ఒక ఇంజనీరింగ్ సవాల్‌గా పరిష్కరించవచ్చని ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ స్పష్టం చేశారు. ఏఐని నియంత్రించేందుకు కఠినమైన నిబంధనల అవసరం లేదని.. అయితే పటిష్టమైన భద్రతా పరీక్షలు మాత్రం చాలా అవసరమని అన్నారు.

డబుల్-లేయర్ సెక్యూరిటీ: 
ఈ భద్రతా సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎన్వీడియా రెండు శక్తివంతమైన ఓపెన్ సోర్స్ టూల్స్‌ను పరిచయం చేసింది. వీటిలో మొదటిది 'ఓపెన్‌షెల్'. ఇది ఎన్వీడియా వీరా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ల(CPU)లపై పనిచేస్తుంది. దీని ద్వారా ఏఐ ఏజెంట్లు ఏయే డేటాను యాక్సెస్ చేయవచ్చో వినియోగదారులు ముందే నిబంధనలను సెట్ చేసుకోవచ్చు. ఆ నిబంధనలను ఇది రియల్ టైమ్‌లో మానిటర్ చేస్తుంది.

రెండోది 'ఎన్వీడియా సెంట్రీ'. ఇది కంపెనీకి చెందిన బ్లూఫీల్డ్ డేటా ప్రాసెసింగ్ యూనిట్లపై రన్ అవుతుంది. ఇది ఏఐ ఏజెంట్ల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఏదైనా ఏజెంట్ అనుమానాస్పదంగా ప్రవర్తించినా, ఇచ్చిన రూల్స్ వైలేట్ చేసినా మిల్లీసెకన్లలోనే దానిని గుర్తించి క్వారంటైన్ (వేరు) చేస్తుందని ఎన్వీడియా ఎంటర్‌ప్రైజ్ ఏఐ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ బొయిటానో తెలిపారు.

►ALSO READ | మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందా ? ఎవరు వాడారో తెలుసా : సైబర్ మోసాలకు ఇలా చెక్ పెట్టండి!

ఇలాంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థలను కనుక ముందుగానే వినియోగించి ఉంటే.. జూలై నెలలో హగ్గింగ్ ఫేస్‌లో జరిగిన భారీ ఉల్లంఘనను నివారించగలిగే వారమని ఎన్వీడియా ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రముఖ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్ 'హగ్గింగ్ ఫేస్'ను ఎన్వీడియా సుమారు 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాము రూపొందించిన ఈ 'ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్‌ఫారమ్' ద్వారా ఏఐ డెవలపర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతను అందించవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఏఐ సాంకేతికత మానవ నియంత్రణ దాటిపోతుందన్న భయాలను పక్కనపెట్టి.. సాంకేతికతను సురక్షితంగా ఎలా పరీక్షించాలో ఈ కొత్త హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టూల్స్ నిరూపిస్తున్నాయి.