ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విలీనంపై మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. శరద్ పవార్, సునేత్రా పవార్ రెండు వర్గాలు మళ్లీ ఒక్కటి కాబోతున్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్సీపీ విలీనంపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ విలీన వార్తలను ఆయన తోసిపుచ్చారు.
తాము ఎవరితోనూ కలవబోమని.. ఎవరైనా తమతో కలవాలనుకుంటే మా దగ్గరికే రావాలని స్పష్టం చేశారు. సోమవారం (సెప్టెంబర్ 28) ముంబైలోని యశ్వంతరావు చవాన్ సెంటర్‌లో పార్టీ ముఖ్య నాయకులతో శరద్ పవార్ భేటీ అయ్యారు. ఎన్సీపీ విలీనం వదంతులు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీపీ విలీనం వార్తలను తోసిపుచ్చారు.
మేము ఎవరితోనూ కలవం. ఎవరితోనూ విలీనం కాబోము. ఎవరికైనా రావాలని ఉంటే మా వద్దకే రావాలి అని ఆయన స్పష్టం చేశారు. అలాగే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని కూడా శరద్ పవార్ కొట్టిపారేశారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమితోనూ, జాతీయ స్థాయిలో ఇండియా కూటమితోనూ తమ ప్రయాణం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.
►ALSO READ | బాలీవుడ్‌లో ఐటీ ప్రకంపనలు.. నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త, మామ ఇంట్లో ఐటీ సోదాలు
తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి స్వతంత్రంగానే ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు రూమర్లను నమ్మొద్దని సూచించారు. రాబోయే ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని కరవు వంటి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిన విషయం తెలిసిందే. దివంగత నేత అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగరేసి కొత్త వర్గా్న్ని ఏర్పాటు చేశారు. అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఆయన సతీమణి సునేత్రా పవార్ ఎన్సీపీ (అజిత్ వర్గం)కి నాయకత్వం వహిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్సీపీ రెండు వర్గాలు మళ్లీ కలబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. శరద్ పవార్ వర్గం కూడా కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో చేరనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్సీపీ విలీన వార్తలను శరద్ పవార్ కొట్టిపారేశారు. దీంతో ఎన్సీపీ విలీన వార్తలకు తెరపడింది.
