- పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం దంపతులు
- రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వానలు కురవాలని యాగం
- 108 మంది రుత్వికులతో శాస్త్రోక్తంగా పూజలు
- పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, వెంకట్‌రెడ్డి, సురేఖ
నల్గొండ, వెలుగు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వానలు కురిసి సమృద్ధిగా పాడిపంటలు పండాలని నాగార్జునసాగర్ వద్ద కృష్ణానదీ తీరంలో ప్రభుత్వం నిర్వహించిన వరుణయాగం సోమవారం వైభవంగా జరిగింది.
ఈ క్రతువులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం దంపతులు పూర్ణాహుతి చేశారు. సోమవారం తెల్లవారుజామున 4.05 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల చతుర్వేద పారాయణంతో యాగం ప్రారంభమైంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 108 మంది రుత్వికుల వేద మంత్రోచ్చారణల మధ్య వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 3.24 గంటలకు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. సాగర్లో సీఎంకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ స్వాగతం పలికారు. యాగశాల వద్ద సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
యాగశాలలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం దంపతులు పూర్ణాహుతి గావించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వానలు పడాలన్న సంకల్పంతో వరుణయాగం నిర్వహించినట్టు సీఎం చెప్పారు. వర్షాల కోసం యాగాలు, పూజలు చేయడం అనాదిగా ఉన్న సంప్రదాయమని, శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ముందుకు వెళ్తూనే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్నట్టు తెలిపారు.
రైతు సంక్షేమం కోసమే యాగం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రైతు క్షేమం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వరుణయాగం నిర్వహించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేదని, సాగుపై దీని ప్రభావం పడనుందని అన్నారు. వానాకాలంలో రైతులు నష్టపోకుండా ఇప్పటికే ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేస్తున్నామని వివరించారు. నీటిపారుదల, వ్యవసాయ శాఖలు సమన్వయంతో నీటిని పొదుపుగా వాడుతూ, రైతులకు సాగునీటి భరోసా కల్పిస్తున్నామన్నారు.
దీనికి తోడు కృష్ణా, గోదావరులు పరవళ్లు తొక్కాలని ఆకాంక్షిస్తూ యాగం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ప్రభుత్వ విప్ లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవ రావు, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
