- కేంద్ర ప్రభుత్వానికి ఎంపీలు రఘురాం రెడ్డి, వంశీకృష్ణ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: ఖమ్మం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న 17వ 'సౌత్ ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2027' నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఎంపీలు రఘురాం రెడ్డి, గడ్డం వంశీకృష్ణ కోరారు. సోమవారం వారిద్దరూ ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా భూటాన్ రాజధాని థింపూలో జూలై 1న జరిగిన సౌత్ ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఛాంపియన్‌షిప్‌ను ఖమ్మంలోనే నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఖమ్మం వేదిక కావడం స్థానిక ప్రజలకు, క్రీడాకారులకు ఎంతో గర్వకారణమని ఎంపీలు పేర్కొన్నారు. ఈ మహాసమరంలో దక్షిణ ఆసియా దేశాల నుంచి దాదాపు 150 మంది అథ్లెట్లు, 300 మందికి పైగా సాంకేతిక, ఇతర అధికారులు పాల్గొంటారని తెలిపారు.
మన దేశీయ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇదొక చక్కటి వేదిక కానుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లాంఛనప్రాయ అనుమతి (ఎన్‌వోసీ) లభించిన వెంటనే ఫెడరేషన్‌తో చర్చించి పోటీల కచ్చితమైన తేదీలు, పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తమ విజ్ఞప్తిపై మన్సుఖ్ మాండవియా సానుకూలంగా స్పందించినట్లు భేటీ అనంతరం ఎంపీలు మీడియాకు వెల్లడించారు. ఖమ్మంలో అంతర్జాతీయ పోటీల నిర్వహణకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
