హైదరాబాద్, వెలుగు: నేటి తరం టీచర్లు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందిస్తూ, సమాజంలోని మూఢనమ్మకాలను దూరం చేయాల్సిన బాధ్యత ఉందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. సోమవారం హైదరాబాద్ దోమలగూడలోని సంఘం స్టేట్ ఆఫీసు అదనపు భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
రవి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఈపీ-2020 పేరుతో విద్యా వ్యవస్థలో అశాస్త్రీయ మార్పులు తెస్తున్నాయని విమర్శించారు. సిలబస్ లో మార్పులు చేస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారని, ఫలితంగా ప్రభుత్వ బడులు రోజురోజుకూ బలహీనపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధ్వంసాన్ని అడ్డుకోవాలంటే ఉపాధ్యాయులు మేధోపరంగా, సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
