హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టేందుకు ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నామని, రాబోయే రెండేండ్లలో ప్రతి రెవెన్యూ విలేజ్ లోని ఒక్కో అంగుళాన్ని సర్వే చేసి మ్యాప్ లతో కూడిన భూధార్ అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేయడంతో పాటు భూ భారతిలో భాగంగా రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సోమవారం ఆయన హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి కమలాపూర్, గూడురు, మర్రిపెల్లిగూడెం డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్భాటాల కోసం అశాస్త్రీయంగా జిల్లాలు, డివిజన్లు, మండలాలను విభజించిందని విమర్శించారు.
గత ప్రభుత్వ హయంలో అసంపూర్తిగా ఉన్న 35 వేలకుపైగా ఇండ్లను పూర్తి చేసి పేదలకు పంపిణీ చేస్తామని చెప్పారు. అనంతరం హనుమకొండ డీసీసీ ఆఫీస్ లో ప్రెసిడెంట్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్.నాగరాజు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జ్ వొడితెల ప్రణవ్, టీపీసీసి మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇతర నేతలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, మండలాల అధ్యక్షులతో చర్చించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డివిజన్ల వారీగా పార్టీ బలాబలాలను సమీక్షించి, గెలుపు వ్యూహాలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం భద్రకాళి మాడవీధులను పరిశీలించి, కాజీపేట దర్గా ఉత్సవాల్లో పాల్గొన్నారు.
విద్యకు అధిక ప్రాధాన్యం : మంత్రి పొన్నం
ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు మౌలిక వసతులు, నూతన భవనాల నిర్మాణం, టీచర్ల నియామకాలు, పదోన్నతులు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. చదువు తర్వాత ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మంత్రుల మాటలకు అడ్డు తగిలిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
కమలాపూర్ మండలంలో సోమవారం డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జోక్యం చేసుకొని అడ్డుతగిలారు.
ఈ క్రమంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీంతో మంత్రులు కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
