ఇండియాపై ఓటమిని తట్టుకోలేకపోయిన పాక్ చీఫ్.. జట్టు నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్..?

ఇండియాపై ఓటమిని తట్టుకోలేకపోయిన పాక్ చీఫ్.. జట్టు నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్..?

టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‎ను ఇండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి దాయాది దేశాన్ని ఏకంగా 61 పరుగుల తేడాతో మట్టికరిపించింది సూర్య కుమార్ సేన. తద్వారా ఐసీసీ వరల్డ్ కప్‎లో పాకిస్తాన్‎పై తమకు ఎదురే లేదని భారత్ మరోసారి నిరూపించింది. 

మరోవైపు ఇండియాపై ఓటమిని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. అభిమానులు, మాజీలు పాకిస్తాన్ జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇండియా చేతిలో ఘోర ఓటమి ఎదురుకావడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా గుర్రుగా ఉంది. ఇండియాతో మ్యా్చ్ అనంతరం పీసీబీ అత్యవసరమైనట్లు తెలిసింది. 

ఈ ఎమర్జెన్సీ భేటీలో జట్టును ప్రక్షాళన చేయాలని.. ఫామ్‎లోని సీనియర్లను నిర్మోహమాటంగా పక్కకు తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా స్టార్‌ ఆటగాళ్ల బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిదికి ఉద్వాసన పలకాలని బోర్డు డిసైడ్ అయినట్లు సమాచారం.

పాక్‌ నెక్ట్స్ నమీబియాతో ఆడబోయే మ్యాచ్‌లో బాబర్‌, అఫ్రిది స్థానాల్లో సల్మాన్‌ మీర్జా, నసీం షా, ఫకర్‌ జమాన్‌, ఖ్వాజా నఫాయ్‌ పేర్లు పరిశీలించాలని సెలెక్షన్ కమిటీకి బోర్డు సిఫార్సు చేసినట్లు తెలిసింది. భారత్ దెబ్బకు స్టార్ ప్లేయర్లు బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిదిని జట్టు నుంచి తొలగించాలని పాక్ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమి చవిచూడటం పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇండియా, పాక్ పోరు తిలకించేందుకు స్వయంగా కొలంబో వచ్చిన నఖ్వీ ముందుగానే పాక్ ఓటమి ఖరారు కావడంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలిసింది.

అనంతరం పీసీబీ అధికారులకు నఖ్వీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారని తెలిసింది. వెంటనే జట్టును ప్రక్షాళన చేయాలని.. ఫామ్‎లో లేని బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది వంటి సీనియర్లను జట్టు నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. వీరి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.