అమ్మకానికి ఎంసీసీ.. జనవరి 12న వేలం వేయనున్నట్లు నోటీసులు

అమ్మకానికి ఎంసీసీ.. జనవరి 12న వేలం వేయనున్నట్లు నోటీసులు
  • వడ్డీతో కలిసి రూ. 54 కోట్ల బకాయిలు
  • వేలం నోటీసు జారీ చేసిన ఇండియన్‌‌ బ్యాంక్‌‌
  • ఐదున్నరేండ్ల కింద మూతపడిన మంచిర్యాల సిమెంట్‌‌ కంపెనీ

మంచిర్యాల, వెలుగు : ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిలిచిన మంచిర్యాల సిమెంట్‌‌ కంపెనీ (ఎంసీసీ) ఆస్తులు ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పులు, ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడంతో 2019లోనే కంపెనీని మూసివేశారు. కంపెనీ మూతపడే నాటికి రూ. 39.40 కోట్లుగా ఉన్న అప్పు... ఈ సంవత్సరం నవంబర్‌‌ 31 నాటికి వడ్డీతో కలిసి రూ. 54.04 కోట్లకు చేరుకుంది. అప్పులు సకాలంలో చెల్లించకపోవడం, నోటీసులకు మేనేజ్‌‌మెంట్‌‌ స్పందించకపోవడంతో కంపెనీ ఆస్తులను వేలం వేసేందుకు.. అప్పులు ఇచ్చిన ఇండియన్‌‌ బ్యాంక్‌‌ సిద్ధమైంది. 

మంచిర్యాలలోని ఎంసీసీ ప్లాంట్ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాల భూములను వేలానికి పెట్టింది. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.346.50 కోట్లు కాగా.. మెషినరీ, క్రషర్‌‌ యూనిట్‌‌తోపాటు ఇతర చరాస్తుల విలువ రూ.4.11 కోట్లుగా లెక్క తేల్చింది. జనవరి 12న ఎంసీసీ ఆస్తులను వేలం వేయనున్నట్లు ఇండియన్‌‌ బ్యాంక్‌‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను మేనేజ్‌‌మెంట్‌‌కు పంపించడంతో పాటు కంపెనీ మెయిన్‌‌ గేట్‌‌ ఎదుట కూడా అతికించింది. 

ఆరున్నర దశాబ్దాల చరిత్ర

మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ)కి ఆరున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. 1956లో ఉత్తరాదికి చెందిన కొంత మంది పెట్టుబడిదారులు కలిసి అసోసియేటెడ్‌‌ సిమెంట్‌‌ కంపెనీ (ఏసీసీ) పేరిట దేశవ్యాప్తంగా 18 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 1958లో మంచిర్యాలలో ఏసీసీ ఆధ్వర్యంలో సిమెంట్‌‌ ఉత్పత్తిని ప్రారంభించారు. రోజుకు వెయ్యి టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 2000 సంవత్సరం వరకు కంపెనీ నిరంతరాయంగా నడిచింది. దేశంలోనే అత్యుత్తమ నాణ్యత గల సిమెంట్‌‌ను ఉత్పత్తి చేసి అనేక రికార్డులను నమోదు చేసింది. 

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణంలో మంచిర్యాల ఏసీసీ సిమెంట్‌‌నే వినియోగించినట్లు రిటైర్డ్ ఉద్యోగులు చెబుతారు. 2000 సంవత్సరం తర్వాత నిర్వహణ లోపాలతో క్రమంగా నష్టాల బాట పట్టింది. దీంతో 2006లో మంచిర్యాలకు చెందిన కొందరు వ్యాపారవేత్తలు వాటాదారులుగా ఏసీసీని కొనుగోలు చేశారు. కంపెనీ పేరును మంచిర్యాల సిమెంట్‌‌ కంపెనీ (ఎంసీసీ)గా మార్చారు. మేనేజ్‌‌మెంట్‌‌ మారిన తర్వాత కంపెనీ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ 2019 జూలై వరకు నడిచింది. ఆ తర్వాత నష్టాల పేరుతో బ్రేక్‌‌ డౌన్‌‌ చేసి సిమెంట్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు.

ఉపాధి కోల్పోయిన కార్మికులు

ఏసీసీలో వెయ్యి మంది కార్మికులు పనిచేసేవారు. పరోక్షంగా మరో ఐదు వేల మందికి ఉపాధి దొరికింది. మేనేజ్‌‌మెంట్‌‌ మారిన తర్వాత క్రమంగా కార్మికుల సంఖ్యను కుదిస్తూ వచ్చారు. చివరకు 50 మంది కార్మికులు మిగలగా.. వారికి సెటిల్‌‌మెంట్‌‌, రిటైర్డ్ కార్మికులకు బెనిఫిట్స్ చెల్లించే విషయంలో సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశారు. చివరకు చట్టంలోని లొసుగులను వాడుకొని మేనేజ్‌‌మెంట్‌‌ కార్మికులకు అన్యాయం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ఐదున్నర సంవత్సరాలుగా కంపెనీ మూతపడడంతో వందలాది మంది ఉపాధి కోల్పోయారు. కంపెనీకి వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ బ్యాంక్ అప్పులు కట్టకపోవడంతో చివరికి వేలం వేసే పరిస్థితి వచ్చింది.