హైదరాబాద్‌లో ప్రయాణికులకు రాపిడో (Rapido) ప్రధాన రవాణా వనరుగా మారిపోయింది. మంగళవారం (మార్చి 3)న విడుదలైన డేటా ప్రకారం, హైదరాబాద్ సిటీలో రాపిడో ద్వారా ప్రతిరోజూ 10 లక్షలకు పైగా బుకింగ్స్ జరుగుతుండటం విశేషం. ముఖ్యంగా మెట్రో స్టేషన్లకు వెళ్లేందుకు లేదా స్టేషన్ల నుండి ఇంటికి చేరుకునేందుకు రాపిడోను జనం ఎక్కువగా వాడుతున్నారు. ఇలా మెట్రోతో కనెక్టై ఉన్న రైడ్‌లే రోజుకు 1.5 లక్షలకు పైగా బుక్ అవుతున్నాయి.
మెట్రో ప్రయాణాన్ని, రాపిడో బైక్స్ లేదా ఆటోలతో కలపడం వల్ల ప్రయాణం ఈజీ అవుతుంది. రాపిడో యాప్‌లోనే మెట్రో టికెట్ బుకింగ్ ఫెసిలిటీ ఉండటం ప్రయాణికులకు మరింత కలిసొస్తుంది.
హైదరాబాద్‌లో బుక్ అవుతున్న మొత్తం రైడ్స్ లో దాదాపు సగం రైడ్స్ ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే సమయాల్లోనే అంటే ఉదయం & సాయంత్రం జరుగుతున్నాయి. అదికూడా కేవలం అప్పుడప్పుడు వాడే యాప్ లాగా కాకుండా, ప్రజల నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుంటూ వెళ్లాల్సిన చోటుకి వేగంగా చేరడానికి బైక్ టాక్సీలు బెస్ట్ అప్షన్ గా నిలుస్తున్నాయి.
రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ సిటీ రవాణా వ్యవస్థను మరింత సాఫీగా చేయడమే మా లక్ష్యమని తెలిపారు. ఒకే యాప్ ద్వారా వివిధ రకాల ప్రయాణ మార్గాలను అంటే మెట్రో + బైక్/ఆటో అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ మరింత ధృడంగా అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి, హైదరాబాద్ డిజిటల్ రవాణా నెట్‌వర్క్‌లో రాపిడో ఒక కీలక శక్తిగా ఎదిగింది.
