ఒక్కడే కొడుకని ఇళ్లు రాసిస్తే..మమ్మల్ని ఇంటి నుంచి గెంటేశారు

ఒక్కడే కొడుకని ఇళ్లు రాసిస్తే..మమ్మల్ని ఇంటి నుంచి గెంటేశారు

కరీంనగర్: రూపాయి రూపాయి కూడబెట్టి ఒక్కగానొక్క కుమారుడిని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రులకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడన్న నమ్మకంతో సొంత ఇంటిని కుమారుడి పేరుతో గిఫ్ట్ డీడ్ చేసినా.. ఇప్పుడు అదే కుమారుడు తమను ఇంటి నుంచి బయటకు పంపించాడని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమకు కుమారుడి నుంచి ప్రాణహాని ఉందంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన దేవలపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ కుమారుడు దేవలపల్లి రవికుమార్ వృత్తిరీత్యా ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారని వారు తెలిపారు.ఖాదీ పరిశ్రమలో చిరుద్యోగిగా పనిచేసిన తాను పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బులతో కరీంనగర్ పట్టణంలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు లక్ష్మణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్కగానొక్క కుమారుడు తమను వృద్ధాప్యంలో చూసుకుంటాడన్న నమ్మకంతో ఆ ఇంటిని అతని పేరుతో గిఫ్ట్ డీడ్ చేసినట్లు తెలిపారు.

అయితే కొంతకాలం తర్వాత కుమారుడు, కోడలు తమను ఇంటి నుంచి బయటకు పంపించారని వృద్ధ దంపతులు ఆరోపించారు. ప్రస్తుతం ఆ ఇంటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులను ఆశ్రయించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని లక్ష్మణ్, జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తాము ప్రస్తుతం సొంత గూడు లేక అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు.

తమ సొంత ఇంటి వద్దకు వెళ్లిన సమయంలో కుమారుడు, కోడలు తమపై దాడికి పాల్పడ్డారని కూడా వారు ఆరోపించారు. తమకు కుమారుడి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్‌ను కోరారు.తమకు తగిన ప్రాణరక్షణ కల్పించడంతో పాటు, తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఇంటిలో తాము జీవించేలా చర్యలు తీసుకోవాలని వృద్ధ దంపతులు కమిషన్‌ను వేడుకున్నారు. తమ వృద్ధాప్యంలో కనీస భద్రత, జీవనాధారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.వృద్ధ తల్లిదండ్రుల ఫిర్యాదుపై మానవ హక్కుల కమిషన్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.