ఎమ్మెల్యేల జీతాల పెంపుకు బ్రేక్.. అసెంబ్లీలో బిల్లు ఉపసంహరించుకున్న ప్రభుత్వం

ఎమ్మెల్యేల జీతాల పెంపుకు బ్రేక్.. అసెంబ్లీలో బిల్లు ఉపసంహరించుకున్న ప్రభుత్వం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యేల జీతాభత్యాల పెంపుకు బ్రేక్ పడింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపునకు సంబంధించిన బిల్లును జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అసెంబ్లీలో ఉపసంహరించుకుంది. ప్రతిపక్ష బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఎమ్మెల్యేల ప్రస్తుత మొత్తం నెలవారీ జీతభత్యాలను రూ. 1.8 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు 2026, సెప్టెంబర్ 28న సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రతిపాదిత బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేల జీతాల పెంపు బిల్లును ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. 

ఓవైపు దినసరి కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమస్యలు పెండింగ్‌లో పెట్టుకుని ప్రజాప్రతినిధుల జీతాలు పెంచడం సరికాదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ వ్యతిరేకించడంతో ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. 

ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల జీతాల పెంపునకు తాను వ్యక్తిగతంగా అనుకూలం కాదని పేర్కొన్నారు. సభలో ఒక్క సభ్యుడు వ్యతిరేకించినా ఈ బిల్లులను ముందుకు తీసుకెళ్లనని పేర్కొంటూ.. ఎమ్మెల్యేల జీతభత్యాల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. 

జీతాల పెంపును సిఫార్సు చేసిన సభా కమిటీలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదని చెప్పారు. బీజేపీ సభ్యులు జీతభత్యాలు కోరుకుంటున్నారని.. కానీ వారు దినసరి కూలీల సమస్యలను ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మెజారిటీ ఓటుతో ఈ బిల్లు ఉపసంహరణకు సభ ఆమోదం తెలిపింది.