ఢాకా: పాకిస్థాన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ప్రయత్నిస్తోన్న బంగ్లాదేశ్‌కు పాక్ తమ అసలు బుద్ధి చూపించింది. బంగ్లాదేశ్‌లోని అణు విద్యుత్ కేంద్రానికి ఇంధనాన్ని తీసుకువస్తున్న రష్యా విమానానికి పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసింది. చివరి నిమిషంలో పాక్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో బంగ్లాకు రావాల్సిన అణు ఇంధన సరఫరా నిలిచిపోయింది.
దశాబ్దాలుగా ఎన్నడూ లేనంతగా బంగ్లా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరతను నివారించేందుకు రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రానికి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా ప్రభుత్వ రంగ అణు ఇంధన సంస్థ రోసాటమ్ నిర్మిస్తోంది. ప్లాంట్‌కు యురేనియం సరఫరా బాధ్యత కూడా ఆ సంస్థదే.
ఈ ఒప్పందంలో భాగంగానే 2026, సెప్టెంబర్ 24న రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రానికి యురేనియం సరఫరా చేయాలని రోసాటమ్ సంస్థ నిర్ణయించింది. రష్యా నుంచి బయలుదేరే విమానం అజర్బైజాన్, కజకిస్థాన్, పాకిస్థాన్, భారత్ మీదుగా ప్రయాణించి ఢాకా చేరాల్సి ఉంది. అయితే, రష్యా నుంచి రావాల్సిన విమానానికి పాక్ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో బంగ్లాకు రావాల్సిన ఇంధన సరఫరా చివరి నిమిషంలో నిలిచిపోయింది.
బంగ్లాదేశ్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫకీర్ మహబూబ్ అనామ్ దీనిని ధృవీకరించారు. పాక్ ఎయిర్ స్పేస్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో రష్యా నుంచి బంగ్లా రావాల్సిన ఇంధన సరాఫరా నిలిచిపోయిందని ఆయన తెలిపారు. చివరి నిమిషంలో పాక్ అనుమతి ఎందుకు నిరాకరించిందో తెలియదన్నారు. విమానాశ్రయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత తమకు గగనతల అనుమతి లభించలేదని రోసాటమ్ అధికారులు తెలియజేశారని ఆయన చెప్పారు.
పాక్ గగనతల అనుమతి నిరాకరించడంతో రోసాటమ్ సంస్థ బంగ్లాకు ఇంధన సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ ఇంధనాన్ని బంగ్లాదేశ్‌కు చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తోన్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన మిగిలిన విడత ఇంధన సరఫరా వేర్వేరు కార్గో విమానాల్లో డిసెంబర్ నాటికి చేరుకుంటుందని.. ప్రాజెక్ట్ షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని బంగ్లాదేశ్‌కు హామీ ఇచ్చింది.
ALSO READ : వాట్సాప్ బిజినెస్ మెసేజీలకు ఛార్జీలు
బంగ్లా రావాల్సిన రష్యా విమానానికి పాక్ గగనతలం అనుమతి నిరాకరించడంపై బంగ్లాదేశ్‌లోని పాక్ హైకమిషన్ స్పందించింది. సాంకేతిక సమస్యలు, విమాన రూటింగ్‌కు సంబంధించిన ప్రక్రియల వల్లే పాక్ అనుమతి నిరాకరించినట్లు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని వివరణ ఇచ్చింది.
