- కార్పొరేషన్లో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన మేయర్, కలెక్టర్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ మెరుగుపర్చడమే ధ్యేయంగా ‘మంచిర్యాల శుభ్రత- ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత’ పేరిట స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. నస్పూర్ ఏరియాలోని 32వ డివిజన్లో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యలతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు నెల రోజుల పాటు అన్ని డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.
ఇందులో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ, రోడ్లను క్లీన్ చేయడం, డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు, రోడ్ల పక్కన పెరిగిన పొదల తొలగింపు, ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు, ప్రభుత్వ సంస్థలను శుభ్రపర్చడం, నీటి నిల్వ ప్రాంతాల తొలగింపు, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, కచ్చా రోడ్ల లెవలింగ్, ఖాళీ స్థలాలను క్లీన్ చేయడం, గుంతలు పూడ్చివేయడం, కాల్వల రిపేర్లు, వాటర్ పైప్‌లైన్ లీకేజీ రిపేర్లు, తక్కువ ప్రెషర్ నల్లా ఫిర్యాదుల పరిష్కారం, ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వడం, బోర్‌వెల్స్ రిపేర్లు, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టనున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ఫంక్షన్ హాళ్లు, హాస్పిటళ్లు, వ్యాపార సముదాయాలు, వైన్స్, బార్ల నిర్వాహకులు శుభ్రత విషయంలో నిబంధనలు పాటించాలని కోరారు.
