బెంగుళూరు కాలేజీల్లో డ్రగ్స్ కలకలం: పోలీసుల తనిఖీల్లో 31 మంది విద్యార్థులకు పాజిటివ్!

బెంగుళూరు కాలేజీల్లో డ్రగ్స్ కలకలం: పోలీసుల తనిఖీల్లో 31 మంది విద్యార్థులకు పాజిటివ్!


బెంగుళూరులోని కాలేజీల్లో డ్రగ్స్ కలకలం రేపాయి. బెంగుళూరు సిటీలోని ఆరు కాలేజీల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 31 మంది విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. బెంగుళూరులోని విజయనగర్ సబ్ డివిజన్ పోలీసులు 'సన్మిత్ర' అనే ప్రత్యేక కార్యక్రమం కింద బుధవారం ఆరు కాలేజీలు, రెండు హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీ యాజమాన్యాల అనుమతి, డాక్టర్లు, టెక్నీషియన్ల సహాయంతో సుమారు 1,200 మంది విద్యార్థుల నుండి శాంపిల్స్ సేకరించారు.

మొత్తం సేకరించిన 1,200 పైగా శాంపిల్స్ లో రాండమ్‌గా పరీక్షించినవి 585. వీరిలో  డ్రగ్స్ వాడుతున్నట్లు తేలిన వారు 31 మంది. డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం కంటే, వారిని ఆ వ్యసనం నుండి బయట పడేయడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. వీరికి మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించి, అవసరమైన వైద్య సహాయం అందిస్తామని పోలీసులు   తెలిపారు.

'సన్మిత్ర' పథకం ఏంటి :
యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వ్యసనాన్ని అరికట్టేందుకు కర్ణాటక పోలీసులు ఈ 'సన్మిత్ర' అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం. డ్రగ్స్ బారిన పడిన వారికి సరైన మార్గదర్శకత్వం, పునరావాసం కల్పించడానికి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయించారు. 'మీ భద్రతే మా లక్ష్యం' అనే నినాదంతో పోలీసులు ఈ నివారణ చర్యలు చేపట్టారు.