ED News: అనిల్ అంబానీకి ఈడీ షాక్: ముంబై, హైదరాబాద్‌లలో మెరుపు దాడులు

ED News: అనిల్ అంబానీకి ఈడీ షాక్: ముంబై, హైదరాబాద్‌లలో మెరుపు దాడులు

Anil Ambani: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కష్టాలు రెట్టింపయ్యాయి. ముంబై, హైదరాబాద్‌లోని అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలు, రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు చెందిన కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరీ శుక్రవారం ఉదయం నుంచే మెరుపు దాడులు నిర్వహిస్తోంది. దాదాపు 10 నుంచి 12 చోట్ల ఈ సోదాలు ఏకకాలంలో జరుగుతున్నట్లు సమాచారం.

శుక్రవారం తెల్లవారుజాము నుంచే దాదాపు 15 ఈడీ బృందాలు రంగంలోకి దిగాయి. ముంబైలోని అనిల్ అంబానీ ప్రధాన కార్యాలయాలతో పాటు హైదరాబాద్‌లోని రిలయన్స్ పవర్‌కు చెందిన పలు కార్యాలయాలు, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్, నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రూ.40వేల కోట్ల భారీ కుంభకోణం?
రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఇతర అనుబంధ సంస్థలు దాదాపు రూ.40వేల కోట్ల బ్యాంక్ రుణాలను అక్రమంగా మళ్లింపులకు పాల్పడ్డాయనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలపై దర్యాప్తు చేసేందుకు ఈడీ సిట్ ను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 26న అనిల్ అంబానీ స్వయంగా ఈడీ ఎదుట హాజరై తన స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.

రూ.3వేల700 కోట్ల ఇల్లు అటాచ్..
ప్రస్తుత సోదాలకు కొద్ది రోజుల ముందే ముంబైలోని అనిల్ అంబానీ విలాసవంతమైన నివాసం 'అబోడ్'ను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. దీని విలువ సుమారు రూ. 3వేల716 కోట్లు ఉంటుందని అంచనా. కేవలం ఇల్లే కాకుండా, దాదాపు రూ.4వేల 400 కోట్ల విలువైన 'ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ' స్థలాన్ని కూడా అధికారులు ఇప్పటికే అటాచ్ చేశారు. ఇప్పటివరకు అంబానీ గ్రూప్‌కు చెందిన మొత్తం రూ.15వేల 700 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోగా.. రానున్న కాలంలో మరిన్ని ఆస్తుల అటాచ్మెంట్ జరిగే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. 

అనిల్ అంబానీ ఆఫీసులపై సోదాలు జరుగుతున్నప్పటికీ.. స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ పవర్ షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవ్వడం విశేషం. అయితే సీబీఐ, ఈడీ ఏకకాలంలో దర్యాప్తును ముమ్మరం చేయడంతో అనిల్ అంబానీకి మరిన్ని చిక్కులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు కూడా తాజా పరిణామాలతో అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు.