T20 World Cup: T20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఇప్పటికే ఫైనల్ కి వెళ్లిన న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. కాగా, రెండో సెమీఫైనల్‌లో భారత్ బలమైన ప్రదర్శన చేసి ఫైనల్ ఫైట్ కి అర్హత సాధించాలని చూస్తుంది. ఇందులో భాగంగా టీమిండియా ఓపెనర్లు తమ ప్రదర్శనను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మాత్రం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ తో ఫామ్‌లోకి వచ్చాడు.
ముంబై ఇండియన్స్ బ్రిగేడ్‌పై ఆశలు:
భారత జట్టులో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ టోర్నమెంట్ ప్రారంభంలో అద్భుతంగా ఆడినా ఇటీవల ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తుంది. గతంలో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఐపీఎల్ లో అనేక మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉండటంతో.. వాంఖెడేలో తిరిగి మంచి ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వాంఖడేలో రాణించాలని అభిమానుల గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
అభిషేక్ శర్మ ఫామ్:
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ ఈ పొట్టి వరల్డ్ కప్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. సూపర్-–8 దశలో జింబాబ్వేపై హాప్ సెంచరీ చేసినా తన అసలు దూకుడు ఇప్పటి వరకు ఇంకా కనిపించలేదు. ఈ సెమీఫైనల్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఒకవేళా ఈ సెమీస్ లో అతడు గానీ చెలరేగితే ఏ ఇంగ్లాండ్ బౌలర్ కూడా అభిషేక్ ని ఔట్ చేసే సహాసం చేయరు అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు.
శాంసన్ అద్భుత ఫామ్:
ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ పూర్తి స్థాయిలో ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాడు. వెస్టిండీస్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో అతను అజేయంగా 97 పరుగులతో నాటౌట్ గా నిలిచి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ వేదికపై సంజు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పాలి.
ఇంగ్లాండ్ బౌలర్ల సవాల్:
ఇంగ్లాండ్ బౌలర్లు టీమిండియా ఓపెనర్లకు కఠిన పరీక్ష పెట్టే అవకాశం కనిపిస్తుంది. సీనియర్ స్పీడ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన బౌన్సర్లతో సంజు శాంసన్‌ను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆఫ్ స్పిన్‌తో విల్ జాక్స్ పవర్‌ప్లేలో మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే, మిడిల్ ఓవర్లలో ఇంగ్లాండ్ స్పిన్ దళం ఇండియన్ జట్టుకు పెద్ద సవాల్ గా మారనుంది. లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఇప్పటి వరకు ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 11 వికెట్లు పడగొట్టగా, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ లియామ్ డాసన్ 10 వికెట్లు తీసి అద్భుతమైన ఫామ్‌ని కనబరుస్తున్నాడు.
వరుణ్ చక్రవర్తికి అగ్ని పరీక్ష:
టీమిండియా మిస్టరీ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు స్థిరంగా రాణించలేకపోయాడు. సెమీఫైనల్‌లోనైనా అతను మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు, జస్ ప్రీత్ బుమ్రా మాత్రమే భారత జట్టు తరపున ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నప్పటకీ, హార్థిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ వికెట్లు తీసుకుంటున్నప్పటికీ.. ధారళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
