కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం

కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దేశంలోని పేదలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు.  మే 12వ తేదీ ఆదివారం లోక్‌సభ ఎన్నికల2024 కోసం 'కేజ్రీవాల్ 10 గ్యారంటీలు' పేరుతో హామీలను ప్రకటించారు.

10 గ్యారంటీల్లో మొదటి హామీగా దేశంలో 24 గంటల విద్యుత్తును అందజేస్తామని చెప్పారు కేజ్రీవాల్. దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని.. కానీ 2 లక్షల మెగావాట్లు మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలిపారు.  డిమాండ్ కంటే ఎక్కువ విద్యుత్ ను మన దేశం ఉత్పత్తి చేయగలదన్నారు. ఇప్పటికే  ఢిల్లీ, పంజాబ్‌లో అమలు చేశామని.. అధికారంలోకి వస్తే దేశంలో కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దేశ్యాప్తంగా పేదలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని.. ఇందుకు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.

రెండో గ్యారంటీగా ఉచిత విద్యను ప్రకటించారు సీఎం కేజ్రీవాల్. ...ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి బాగా లేదని... ప్రతి ఒక్కరికీ అద్భుతమైన ఉచిత విద్యను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తామన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఇప్పటికే అమలు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రూ.5 లక్షల కోట్లు అవసరమవుతుందని చెప్పారు.  ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 2.5 లక్షల కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 2.5 కోట్లు ఇస్తాయని ఆయన తెలిపారు.

ఇక, మూడో గ్యారంటీగా ఉచిత వైద్యాన్ని ప్రకటించారు కేజ్రీవాల్. ఈరోజు మన దేశంలో ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి బాగా లేదన్నారు.  అందరికీ మంచి వైద్యం అందిస్తామని. ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో మొహల్లా క్లినిక్‌లు తెరుస్తామని చెప్పారు.  జిల్లా ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందుతుందని తెలిపారు.  బీమా ఆధారంగా చికిత్స జరగదని.. ఇది పెద్ద మోసమని చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.