ఎల్లారెడ్డిపేట, వెలుగు: తనిఖీల పేరుతో కలెక్టర్ కృష్ణ భాస్కర్, అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ తమను వేధిస్తున్నారని ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కొండాపురం బాల్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్లతో కలిసి ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట మండలంలో అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ ఇటీవల శ్మశానవాటికలు, విలేజ్ పార్కులు, కంపోస్టు షెడ్ల నిర్మాణ పనులను పరిశీలించి దేవునిగుట్ట తండా సర్పంచ్ పెంటయ్య, వెంకటాపుర్ సర్పంచ్ అంజమ్మ, బాకుర్ పల్లి సర్పంచ్ మంజులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారన్నారు. ఆఫీసర్లు మెడ మీద కత్తి పెట్టినట్లు 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆంక్షలు విధించడం సరికాదన్నారు. తమపై వేధింపులు మానకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.
