అతనో ఇంజినీర్.. డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు.. గుండెలు పిండేస్తున్న కథ

అతనో ఇంజినీర్.. డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు.. గుండెలు పిండేస్తున్న కథ

ఒక ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తోన్న విద్యావంతుడైన ఓ యువకుడి హృదయాన్ని కదిలించే కథ ఆన్‌లైన్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. అతని కథ నెటిజన్ల హృదయాలను ద్రవింపజేసింది. యాప్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసిన కస్టమర్.. డెలివరీ బాయ్‌తో చేసిన సంభాషణను లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సాహిల్ సింగ్‌.. డెలివరీ బాయ్ గా మారే ప్రక్రియ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.

ఆర్డర్ డెలివరీ చేయడానికి సింగ్ కిలోమీటర్లు నడిచాడు..

లింక్డ్‌ఇన్ యూజర్, స్విగ్గీ కస్టమర్ ప్రియాంషి చందేల్ తన ఐస్ క్రీం ఆర్డర్‌ను చాలా ఆలస్యంగా అందుకున్నారు. దీంతో ఆమె డెలివరీ పార్ట్ నర్ ని ఆ విషయంపై ప్రశ్నించింది. ఆలస్యానికి గల కారణాన్ని సింగ్‌ను అడిగగా.. అతని వద్ద నడపడానికి బైక్ లేదని, ఆర్డర్ డెలివరీ చేయడానికి దాదాపు మూడు కిలోమీటర్లు నడిచి వచ్చానని చెప్పడం చూసి ఆమె షాక్ కు గురైంది. "మేడమ్, నాకు ప్రయాణించడానికి స్కూటీ లేదా ఎలాంటి రవాణా లేదు, మీ ఆర్డర్‌తో నేను 3 కిలోమీటర్లు నడిచాను. నా దగ్గర డబ్బు లేదు" అని సింగ్ చందేల్‌తో లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తెలిపారు.

తర్వాత, తాను చదువుకున్నవాడినని, నింజాకార్ట్, BYJU'S వంటి కంపెనీలలో రూ.25వేల జీతంతో పనిచేశానని సింగ్ చెప్పాడు. "నేను పూర్తిగా చదువుకున్న ECE గ్రాడ్‌యేట్ ని, నేను కొవిడ్ సమయంలో జమ్మూలో ఉన్న మా ఇంటికి వెళ్ళే ముందు బైజెస్‌లోని నింజాకార్ట్‌లో పనిచేశాను" అని చందేల్ మాటలను వివరిస్తూ ఆమె పోస్ట్ లో పేర్కొంది.

డెలివరీ బాయ్ చాలా కష్టంలో ఉన్నాడని, వారం రోజులుగా ఆహారం తీసుకోలేదని, నీళ్లు, టీ తాగి మాత్రమే బతుకుతున్నాడని చందేల్ గుర్తించింది. ఈ క్రమంలోనే అతను, ఆమెను సహాయం అడిగాడు. మంచి జీవితాన్ని గడపడానికి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సహాయం చేసే ఉద్యోగం తనకు దొరుకుతుందా అని అభ్యర్థించాడు. "నేను ఏమీ అడగడం లేదు, నాకు ఉద్యోగం దొరికితే చాలు. నేను ఇంతకు ముందు రూ.25 వేలు సంపాదించేవాణ్ణి. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు. నా తల్లిదండ్రులకు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. ఈ వయసులో వారిని డబ్బు అడగలేను" అని అతను చెప్పాడు.

అర్హతలు

చిత్తోర్‌గఢ్‌లోని మేవార్ విశ్వవిద్యాలయం నుంచి సాహిల్ సింగ్ కథతో పాటు ఒక సర్టిఫికేట్ కూడా షేర్ చేయబడింది. అతను 2018లో B.Tech డిగ్రీని పొందినట్లు అధికారిక పత్రం పేర్కొంది. ఆన్‌లైన్‌లో పంచుకున్న అతని కరికులమ్ విటేలో, సింగ్‌కు టాలీ, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో డిప్లొమా ఉన్నట్లు గుర్తించబడింది. డెలివరీ బాయ్‌కి సంబంధించిన అప్‌డేట్‌లో, చందేల్ తన కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తనకు ఉద్యోగం దొరికిందని పేర్కొన్నాడు. "అతనికి ఉద్యోగం వచ్చింది!!! ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అంటూ చందేల్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.