పేదలకు అండగా.. స్ట్రీట్ ఫర్ కాజ్

పేదలకు అండగా.. స్ట్రీట్ ఫర్ కాజ్

చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లోను ముందుంటున్నారు ఈతరం విద్యార్థులు. తోచినంత సాయం చేస్తూ నలుగురిలో తమ ప్రత్యేకతని చాటుకుంటున్నారు. ఇలా కొన్ని కాలేజీల స్టూడెంట్స్ అంతా కలిసి ఓ ఎన్జీవో స్టార్ట్ చేశారు. పదేళ్లుగా పల్లెల్లోని నిరుపేదలకు అండగా ఉంటున్నారు.

స్ట్రీట్ ఫర్ కాజ్.. ఇదొక స్టూడెంట్స్ ఎన్జీవో.. 2009లో నలుగురు స్టూడెంట్స్ కలిసి దీన్ని ప్రారంభించారు. మారుమూల ప్రాంతాలకు, ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో దీన్ని ప్రారంభించారు. పదేళ్లుగా హైదరాబాద్ లో యూత్ అసెంబ్లీ పెట్టి ఏయే గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నాయి.. వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో డిస్కస్ చేశారు. సమస్యల సాధన కోసం తమవంతు కృషి చేయాలని డిసైడ్ అయ్యారు. అంతే అప్పటి నుంచి పదేళ్లుగా పల్లెలకు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన సుమారు 60 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఎనిమిదివేల మంది స్టూడెంట్స్ స్ట్రీట్ ఫర్ కాజ్ లో సభ్యులుగా ఉన్నారు.

జూబ్లీహిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో స్ట్రీట్ ఫర్ కాజ్ సభ్యులు ఎనిమిదో యూత్ అసెంబ్లీ ఏర్పాటు చేశారు. గ్రామాల్లో విద్య, ఉపాధి, ఆహారం, తాగునీటిని.. పేదలకు అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఏదో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేసి గ్రామాన్ని ఎంచుకుని దానిపై ఏడాదిపాటు పనిచేస్తామంటున్నారు.

చిన్న వయుసులోనే సమాజ సేవ చేస్తున్న స్ట్రీట్ ఫర్ కాజ్ సభ్యులను అభినందించారు IAS బాల లత. వీరి స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలన్నారు. పదేళ్లలో చాలా గ్రామాల్లో సమస్యలు పరిష్కరించామంటున్నారు స్ట్రీట్ ఫర్ కాజ్ ఛైర్మన్ మహమ్మద్ సోహైల్.

చదువులు కొనసాగిస్తూనే సెలవుల్లో పేదలకు సేవచేసేందుకు పల్లెలకు వెళ్తున్నారు స్ట్రీట్ ఫర్ కాజ్ సభ్యులు. పాకెట్ మనీతో పాటు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ నిధులు సేకరిస్తున్నారు.