మద్యం వద్దన్నందుకు పురుగుల మందు తాగిండు

మద్యం వద్దన్నందుకు పురుగుల మందు తాగిండు
  • తాగొద్దని బిడ్డ వారించినందుకు పురుగుల మందు తాగిన తండ్రి
  • మనస్తాపంతో తల్లీకూతురు కూడా ఆత్మహత్యాయత్నం
  •  ముగ్గురి పరిస్థితి విషమం.. ఖమ్మం ఆస్పత్రికి బాధితులు

కోదాడ, వెలుగు : పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు పెట్టింది. తాగుడు మానుకోవాలని చెప్పినందుకు మొదలైన గొడవ ముగ్గురి ప్రాణం మీదికి తెచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురూ ఆత్మహత్యాయత్నం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  మండలం వేపల సింగారం గ్రామానికి  చెందిన మసిరెడ్డి రామిరెడ్డి (50) కి గ్రామంలో ఎకరం భూమి ఉంది. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్న ఆయన.. కొన్నేండ్లుగా మద్యానికి బానిసయ్యాడు. కాగా, రాంరెడ్డి  కూతురు  స్నేహలతా రెడ్డి  చదువు కోసం కొంత కాలం కింద ఆయన కుటుంబం కోదాడలోని గణేశ్ నగర్ కు మారింది. డిగ్రీ పూర్తిచేసుకున్న స్నేహలత.. హైదరాబాద్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నది. రెండు రోజుల కింద కోదాడలోని ఇంటికి వచ్చిన ఆమె..  సోమవారం రాత్రి  మద్యం తాగుతున్న తండ్రిని వారించింది. దీంతో వారి మధ్య  గొడవ మొదలైంది. 

తనను తాగొద్దన్నారన్న కోపంతో  రామిరెడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య జ్యోతి, కూతురు స్నేహలత కూడా ఆవేశంలో పురుగుల మందు తాగారు. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంటకు నొప్పి భరించలేక అదే కాలనీలో ఉండే సమీప బంధువు నరేందర్  రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి స్థానికుల  సహాయంతో బాధితులను  ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్ మెంట్​ ఇచ్చిన డాక్టర్లు.. వారి పరిస్థితి  విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స  కోసం ఖమ్మం తరలించారు. అయితే, ఈ  ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని  పోలీసులు వెల్లడించారు.