భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల  జెన్​కో ఓపెన్​కాస్ట్ పరిధిలో  తేలని మంటల మర్మం 

భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల  జెన్​కో ఓపెన్​కాస్ట్ పరిధిలో  తేలని మంటల మర్మం 

మల్హర్, వెలుగు: ఆ ఊర్లోని ఓ ఇంట్లో భూమి నుంచి మంటలు వస్తున్నాయి. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా మంటలు వస్తుండడంతో కుటుంబసభ్యులంతా భయపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రం తాడిచెర్ల  జెన్​కో ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్ పరిధిలోని చెరువు కట్ట కింద ప్రాంతంలో ఉంటున్న మందపల్లి పోచయ్య ఇంట్లో తరచూ ఇలా జరుగుతోంది. గురువారం పోచయ్య ఇంటి ఆవరణలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వరిగడ్డి కాలిపోయింది. శుక్ర, శని ఆది, సోమవారాల్లోనూ ఇంట్లో స్వల్పంగా మంటలు వచ్చాయి. మంగళవారం మంటలు చెలరేగి బెడ్, బట్టల మూటలు కాలిపోయాయి. కొద్ది రోజులుగా మంటలు వస్తుండడంతో పోచయ్యతో పాటు తాడిచెర్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన, ఏ వైపు నుంచి మంటలు వస్తాయోనని భయపడి ఇండ్లకు తాళాలేసుకుని బంధువుల ఇండ్లకు పోతున్నారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్ పరిధిలోని మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి. ఓపెన్ కాస్ట్ ఉండడంతో గ్యాస్ లీకై మంటలు వస్తున్నాయా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియడం లేదు. మరోవైపు క్షుద్ర ప్రయోగం జరిగిందని, అందుకే ఇలా జరుగుతోందని గ్రామస్తులు మూఢ నమ్మకాలు పెంచుకుంటున్నారు. తొందరగా అధికారులు ఒక బృందాన్ని పంపి నిజం ఏమిటో తేల్చాలని గ్రామస్తులు  డిమాండ్ ​చేస్తున్నారు.