మరో ఉద్యమానికి సిద్ధం కావాలని లాయర్లకు పిలుపు

 మరో ఉద్యమానికి సిద్ధం కావాలని లాయర్లకు పిలుపు

 

  •     సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నరు
  •     మరో ఉద్యమానికి సిద్ధం కావాలని లాయర్లకు పిలుపు

హైదరాబాద్, వెలుగు: జీవో 317 సవరించేదాకా రాష్ట్ర సర్కారుతో కొట్లాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భరోసా ఇచ్చారు. శనివారం పార్టీ స్టేట్ ఆఫీసులో ఉద్యోగులు, టీచర్లు సంజయ్​ని కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. ఆందోళన చెందవద్దని, బీజేపీ అండగా ఉంటుందని సంజయ్ వారికి భరోసా ఇచ్చారు. సర్కారు దిగొచ్చి జీవో సవరిస్తే సరే.. లేదంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సవరణ ఉత్తర్వులపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు.

వేధింపులను అడ్డుకోవడంలో లాయర్లే కీలకం
బీజేపీ చేస్తున్న ప్రజా ఉద్యమాలతో కేసీఆర్ సర్కారుకు భయం పట్టుకుందని, అందుకే సోషల్ మీడియాలో పోస్టింగ్​లు పెడుతున్నోళ్లను వేధిస్తోందని సంజయ్ ఆరోపించారు. పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్లు, సోషల్ మీడియా కార్యకర్తలతో సంజయ్ భేటీ అయ్యారు. సర్కారుకు వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెడితే తమ ఇండ్లమీద పోలీసులు దాడులు చేస్తున్నారని, భయాందోళనకు గురిచేస్తున్నారని సోషల్ మీడియా కార్యకర్తలు సంజయ్​ దృష్టికి తెచ్చారు. అనంతరం సంజయ్ మాట్లాడారు. సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులు అరికట్టడంలో అడ్వకేట్ల పాత్ర కీలకమన్నారు. అవినీతి పాలనకు అంతమొందించాలంటే ఉద్యమాలు చేయాల్సిందేనన్నారు.  బీజేపీ నేతలు రాంచందర్ రావు, ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • ఉద్యమ ద్రోహులకే కేసీఆర్ ప్రాధాన్యం
  • మీడియా చిట్ చాట్​లో సంజయ్

ఉద్యమ ద్రోహులకే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఉద్యమకారులను ప్రగతి భవన్ లోకి రానివ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కేరళ సీఎం విజయన్, సీఎం కేసీఆర్ భేటీపై ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తూ విందు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏం చేశాయో ప్రజలందరికీ తెలుసన్నారు. ఉద్యమ ద్రోహులకే కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని, ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన వారికి ప్రాధాన్యం లేని కార్పొరేషన్ పదవులు ఇస్తున్నారని అన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసని,అందుకే బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.