హైదరాబాద్​లో టూరిస్ట్​ స్పాట్స్ ఇవే..

 హైదరాబాద్​లో  టూరిస్ట్​  స్పాట్స్ ఇవే..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలకు అడ్డా తెలంగాణ గడ్డ. అందులోనూ హైదరాబాద్​లో ఇలాంటి కట్టడాలు చాలా ఎక్కువ. కట్టడాలకే పేదవాళ్ల కడుపు నింపేందుకు హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి బతుకుతుంటారు. పొట్ట చేతపట్టుకుని వచ్చినవాళ్లకు పని చూపించి కడుపు నింపుతుంది. ఇప్పుడే కాదు.. ఎప్పటినుంచో హైదరాబాద్​ది ఇదే తత్వం. నిజాం కాలంలో కూడా ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది వలసలు వచ్చారు. అంతేకాదు.. హైదరాబాద్​లో టూరిస్ట్​ అట్రాక్షన్స్​ కూడా చాలానే ఉన్నాయి. వాటిలో  కొన్ని... 

సాలార్ జంగ్ మ్యూజియం

దేశంలోని ముఖ్యమైన నేషనల్​ మ్యూజియంలలో ‘సాలార్ జంగ్ మ్యూజియం’ ఒకటి. ఇందులో ఉన్న పురాతన వస్తువులు నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్‌‌‌‌‌-3 సేకరించారు. పాలరాతి శిల్పాలు, ఏనుగు దంతాల కళాకృతులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. పర్షియా, ఈజిప్ట్, ఉత్తర అమెరికా, ఐరోపా, చైనా, బర్మా, నేపాల్, జపాన్ దేశాలకు సంబంధించిన లోహ కళాఖండాలు, తివాచీలు, సెరామిక్స్, బొమ్మలు, శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొఘలుల కాలం నాటి కత్తులు, బాకులు ఇక్కడ స్పెషల్​ ఎట్రాక్షన్​..

చార్మినార్

హైదరాబాద్​ అనగానే మొదట గుర్తొచ్చేది చార్మినార్​.. అందుకే చార్మినార్​ చూస్తేనే హైదరాబాద్​ చూసినట్టు అనుకుంటారు టూరిస్ట్​లు. దీన్ని ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా చెప్తుంటారు. నాలుగు మినార్లు ఉండడమే కాదు.. దీని నిర్మాణంలో ఏ భాగం కొలతైనా నాలుగే ఉంటుంది. లేదా.. నాలుగుతో భాగించబడుతుంది. 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చార్మినార్​ను కట్టించాడు. 1889లో హైదరాబాద్​ను పాలించిన మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్​కు నాలుగు వైపులా పెట్టించాడు.

బిర్లా మందిర్: హైదరాబాద్​లో టూరిస్ట్​ ప్లేస్​ల్లో ముఖ్యమైనది.

 వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయ నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ స్టైల్​లో ఉంటుంది. గర్భగుడి విమాన గోపురం పూరీలోని జగన్నాథ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. 280 అడుగుల ఎత్తయిన నౌబత్ పహాడ్ కొండపై రెండు వేల టన్నుల పాలరాతితో ఈ ఆలయాన్ని కట్టారు. 1966లో మొదలైన ఈ నిర్మాణం పూర్తయ్యేందుకు పదేండ్లు పట్టింది.  గుడిలో 11 అడుగుల ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒరియా శైలిలో ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధుని విగ్రహం, లాల్ బహదూర్ స్టేడియం, లుంబినీ పార్క్, కొత్త అసెంబ్లీ కనిపిస్తాయి.

చౌమహల్లా ప్యాలెస్

హైదరాబాద్​ని పాలించిన నిజాం రాజుల నివాస స్థలం ఇది. పర్షియన్ భాషలో ‘చాహర్’ అంటే నాలుగు, అరబ్ భాషలో ‘మహాలత్’ అంటే సౌధం అని అర్థం. రెండు పదాల కలయికతో దీనికి ‘చౌమహల్లా’ అని పేరు పెట్టారు. ఇందులో నాలుగు మహల్​లు ఉన్నాయి. వాటిని అఫ్జల్ మహల్, అఫ్తాబ్ మహల్, మహతాబ్ మహల్, తహ్నియాత్ మహల్ అని పిలుస్తారు. 14 ఎకరాల్లో ఉంది. 2010లో దీన్ని యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ప్యాలెస్​లో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. పర్షియన్, యూరోపియన్, రాజస్తానీతో సహా అనేక నిర్మాణ శైలుల ప్రభావం ఈ ప్యాలెస్​ మీద ఉంది.