బీటెక్.. డిగ్రీ కాదంట: పోస్టుల భర్తీలో విద్యుత్ శాఖ వింత పోకడ

బీటెక్.. డిగ్రీ కాదంట: పోస్టుల భర్తీలో విద్యుత్ శాఖ వింత పోకడ

    జేపీఓ, జేఏసీఏ పోస్టుల్లో బీఏ , బీఎస్సీ, బీకాం డిగ్రీలకే అనుమతి

    23,018 మంది బీటెక్ కేండిడేట్ల అప్లికేషన్లు రిజెక్ట్‌‌

    భవిష్యత్​లో అడ్మినిస్ర్టేషన్ సమస్యలొస్తయ్: అధికారులు

  సబ్‌‌ ఇంజనీర్‌‌, ఏఈ పోస్టులకు కన్వర్షన్ అడిగే చాన్స్​

విద్యుత్‌‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌‌లో డిగ్రీ అర్హతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీటెక్ ను డిగ్రీగా గుర్తించని విద్యుత్ శాఖ.. 23,018 మంది అప్లికేషన్లను ‘ఇన్‌‌వ్యాలీడ్‌‌ క్వాలిఫికేషన్‌‌’ అంటూ రిజెక్ట్‌‌ చేసింది. దీంతో బీటెక్‌‌ చేసిన అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. డిగ్రీ క్వాలిఫికేషన్‌‌ ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు బీటెక్‌‌ చేసిన వారిని అనుమతిస్తుండగా విద్యుత్‌‌ శాఖ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, తమకు అవకాశం లేకుండా చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

విద్యుత్‌‌ శాఖ ఇటీవల 2,500 జూనియర్‌‌ లైన్‌‌మెన్‌‌ (జేఎల్ఎం) పోస్టులు, 25 జూనియర్‌‌ పర్సనల్‌‌ ఆఫీసర్‌‌ (జేపీవో) పోస్టులు, 500 జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ కమ్‌‌ కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌ (జేఏసీఏ) పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. జేఎల్‌‌ఎం పోస్టులకు 58,568 దరఖాస్తులు వచ్చాయి. కేవలం ఐటీఐ అభ్యర్థులను మాత్రమే ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించారు. ఇక జేపీఓ పోస్టుకు 36,557 అప్లికేషన్లు, జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ కమ్‌‌ కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌ పోస్టులకు 1,13,891 దరఖాస్తులు వచ్చాయి. జేపీవో, జేఏసీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో 23,018 మంది అప్లికేషన్లను ఇన్‌‌వ్యాలీడ్‌‌ క్వాలిఫికేషన్‌‌ పేరుతో అధికారులు రిజెక్ట్‌‌ చేశారు. డిగ్రీ ఈక్వలెంట్‌‌ క్వాలిఫికేషన్‌‌ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌‌లో విద్యుత్ శాఖ పేర్కొంది. దీంతో బీటెక్‌‌ చేసిన అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే విద్యుత్‌‌ శాఖ అధికారులు ప్రొఫెషనల్‌‌ డిగ్రీ చేసిన వారందరినీ రిజెక్ట్‌‌ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థలు బీటెక్‌‌ పట్టాను డిగ్రీగా గుర్తిస్తుండగా.. రాష్ట్రంలో కొత్త విధానం ఏంటని కేండిడేట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలొస్తయనే రిజెక్ట్ చేశాం..

ప్రొఫెషనల్‌‌ డిగ్రీ ఉన్న వారిని అనుమతిస్తే ఎదురయ్యే సమస్యల నేపథ్యంలోనే బీటెక్‌‌ వారిని రిజెక్ట్‌‌ చేశామని విద్యుత్‌‌ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే నోటిఫికేషన్‌‌లో బీఏ, బీకాం, బీఎస్సీ లేదా అవే సబ్జెక్టులతో చేసే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్‌‌ డిగ్రీలనే అనుమతిస్తామని పేర్కొన్నామని అంటున్నారు. ఈ పోస్టులకు మామూలు డిగ్రీ చాలంటున్నారు. ‘‘బీటెక్‌‌ చేసిన అభ్యర్థులు జూనియర్‌‌ పర్సనల్‌‌ ఆఫీసర్‌‌గా కానీ, జూనియర్ అసిస్టెంట్‌‌ కమ్‌‌ కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌గా కానీ ఎంపికైతే భవిష్యత్తులో విద్యుత్‌‌ సంస్థల్లో సమస్యలు తలెత్తుతాయి. తమకు అర్హత ఉందంటూ సబ్‌‌ ఇంజనీర్‌‌, ఏఈ పోస్టులకు భవిష్యత్​లో కన్వర్షన్‌‌ అడిగే అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్‌‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సర్వీస్‌‌పై వెయిటేజ్‌‌ ఇస్తూ కన్వర్షన్‌‌ ఇవ్వండని చట్టపరంగా పోరాడే అవకాశం ఉంటుంది. రిక్రూట్‌‌మెంట్‌‌ ద్వారా సబ్‌‌ ఇంజనీర్లుగా వచ్చిన వారితో సీనియార్టీ సమస్యలు వస్తాయి. అందుకే ప్రొఫెషనల్‌‌ డిగ్రీలను అనుమతించలేదు” అని అధికారులు వివరించారు.

15 నుంచి పరీక్షలు

జూనియర్ లైన్‌‌ మెన్‌‌, జూనియర్‌‌ పర్సనల్‌‌ ఆఫీసర్‌‌ పరీక్షలను ఈనెల 15న నిర్వహించనున్నారు. జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ కమ్‌‌ కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌ పరీక్షను 22న నిర్వహించనున్నారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి