తెలంగాణను ఐసీఎంఆర్ డైరెక్షన్​లోకి తీసుకురావాలి

తెలంగాణను ఐసీఎంఆర్  డైరెక్షన్​లోకి తీసుకురావాలి

న్యూఢిల్లీ, వెలుగు: కరోనా కట్టడికి ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్ లైన్ అమలులో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణను కేంద్రం ఐసీఎంఆర్ డైరెక్షన్ లోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రజారోగ్యం దృష్ట్యా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైరస్ కట్టడికి మూడు ”టీ”ల సిద్ధాంతం.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని పకడ్భందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కరోనా నిర్మూలన చర్యలపై సీఎం కేసీఆర్ ప్రధాని నిర్ణయాలను పొగడడమే కాకుండా, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కరోనాపై కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి రాష్ట్రాన్ని హెచ్చరిస్తోందని అన్నారు. వైరస్ నియంత్రణ లో కేంద్రంతో కలిసి పని చేయడంతో పాటు, ఐసిఎంఆర్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉందని చెప్పారు.

క్రైసిస్ లోనూ అంకితభావంతో పని చేస్తున్నం

కరోనా క్రైసిస్ టైమ్​లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోందన్నారు. ఒక వైపు ప్రజా సంక్షేమం, మరో వైపు ఆర్థిక అభివృద్ధిని కాపాడుకునే దిశలో కీలక నిర్ణయాలను అమలుచేస్తున్నట్లు చెప్పారు. 2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించే క్రమంలో కేంద్రం పనిచేస్తోందన్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ దశలవారీగా దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు అందిస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈ లకు ఊతమిచ్చేలా 3 లక్షల కోట్ల రుణ సదుపాయం కల్పించగా, ఇప్పటికే లక్ష 10 వేల కోట్లు వితరణ చేసినట్లు చెప్పారు. లక్ష 70 వేల కోట్లతో చేపట్టిన గరీబ్ కల్యాణ్ యోజన, గరీబ్ అన్న యోజన, గరీబ్ రోజ్ గార్ యోజన లక్ష్యాలను చేరుకుంటుందని తెలిపారు.