ఉత్తరాదిని వణికిస్తున్న చలి

ఉత్తరాదిని వణికిస్తున్న చలి

లడఖ్​ గడ్డకట్టింది. ఢిల్లీ గజ గజా వణుకుతోంది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్తాన్, హిమాచల్ వంటి ఉత్తరాది ప్రాంతాలన్నింటినీ చలిగాలులు వణికిస్తున్నాయి. ఉత్తరాదిన ఇప్పటికే టెంపరేచర్లు నార్మల్ కంటే చాలా తక్కువకు పడిపోయాయి. రానున్న రోజుల్లో మరింతగా పడిపోతాయని చెప్తున్నారు. మరోవైపు ఢిల్లీ, ఇతర నగరాలను పొగమంచు కూడా విపరీతంగా కమ్మేసింది. అటు పాకిస్తాన్ నుంచి ఇటు బీహార్ వరకూ.. ఎటు చూసినా పొగమంచు మేఘాలే తక్కువ ఎత్తులోనే.. కళ్లముందు నుంచే కదులుతూ వెళ్తున్నాయి. లడఖ్​లోని ద్రాస్ ప్రాంతంలో కనిష్ట టెంపరేచర్లు మైనస్ 30.2 డిగ్రీ సెల్సియస్​కు పడిపోయాయి. ఇక ఢిల్లీలో వరుసగా11 రోజులు కోల్డ్ స్పెల్ పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో మీన్ మ్యాగ్జిమం టెంపరేచర్19 డిగ్రీలుగా నమోదవుతుందని, దీంతో ఈ డిసెంబర్ 100 సంవత్సరాల్లోనే రెండో కోల్డ్ డిసెంబర్ గా రికార్డులకు ఎక్కనుందని అంటున్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ కూడా ‘వెరీ పూర్’ కేటగిరీకి పడిపోయింది. మరోవైపు ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో గత 48 గంటల్లోనే 38 మంది చలికి బలైపోయారని అనధికారిక వార్తలను బట్టి తెలుస్తోంది.

‘వెస్టర్న్ డిస్టర్బెన్సెస్’ వల్ల వింటర్ రెయిన్స్…

నార్త్ ఇండియాలో చలి ఇంతగా పెరగడానికి మధ్యదరా సముద్రంలో ఏర్పడిన ‘వెస్టర్న్ డిస్టర్బెన్సెస్’ సిచుయేషనే కారణమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. క్లైమేట్ చేంజ్ కారణంగా హిందూ మహాసముద్రం వేడెక్కడం వల్ల మధ్యదరా సముద్రంలో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ (ఇండియా వైపు వచ్చే ఆకస్మిక గాలులు)కు దారితీసిందని, దీంతో నార్త్ ఇండియాలో సడన్​గా  వింటర్ రెయిన్స్ పడుతున్నాయని ఇండియా మెటియోరాలజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రాజేంద్ర జెనమణి వెల్లడించారు. ఈ పరిస్థితుల వల్ల ఉత్తరాదిన చాలా సిటీల్లో టెంపరేచర్లు 12 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయన్నారు. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగానే దక్షిణ, మధ్య ఇండియాలో వెచ్చని వాతావరణం, ఉత్తరాదిన తీవ్ర చలి వాతావరణం ఏర్పడిందని పూణేలోని సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ (సీసీసీఆర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ భూపీందర్ బి.సింగ్ చెప్పారు.

రాబోయే రోజుల్లో హిమాలయన్, ఇండో–గ్యాంగెటిక్, నార్త్ ఇండియా ప్రాంతాల్లో వాతావరణం మరింత దారుణంగా మారుతుందన్నారు. గ్రీన్ హౌజ్ వాయువుల విడుదల, గాలిలోకి దుమ్ము, ధూళి పెరగడం కూడా ఇందుకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.   ఉత్తరాదిన డిసెంబర్12, 13న కురిసిన వర్షాలతో గాలిలో తేమ బాగా పెరిగింది. డిసెంబర్ 20, 21న ఈ తేమ దాదాపుగా వంద శాతానికి చేరింది. దీంతో పొగమంచు ఏర్పడింది. ఈ పొగమంచు పగటిపూట వేడెక్కి, కొంత పైకి లేచి, 100 నుంచి 300 మీటర్ల ఎత్తులోనే పొగమంచు మేఘాలను ఏర్పర్చాయి. దీంతో ఎండ నేలను తాకలేదు. పాకిస్తాన్ నుంచి బిహార్ వరకూ వరుసగా రోజుల తరబడీ ఇదే జరగడంతో ఇక్కడి ప్రాంతాల్లో ఎండ ఒక్క రోజు కూడా రాలేదు. దీనికి తోడు డిసెంబర్14 నుంచీ హిమాలయాల ద్వారా మరింత చల్లని గాలులు వీస్తున్నాయి.