మేడిగడ్డ వద్ద నీటి దినోత్సవం లేనట్టే.!

మేడిగడ్డ వద్ద నీటి దినోత్సవం లేనట్టే.!
  •     నీళ్లు లేక అన్నారం బ్యారేజీ‌‌కి మార్చిన ప్రభుత్వం
  •     అక్కడే లేజర్‌‌‌‌ షో, సెల్ఫీ వ్యూ కోసం ఏర్పాట్లు
  •     ఈ నెల 7న కార్యక్రమం   హాజరుకానున్న మంత్రి సత్యవతి

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ దగ్గర నీళ్లు లేక వెలవెలబోతుండడం, కన్నెపల్లి పంప్‌‌‌‌ హౌజ్‌‌‌‌ వద్ద పనులు పూర్తి కాకపోవడంతో నీటి దినోత్సవాన్ని ప్రభుత్వం అన్నారానికి మార్పు చేసింది. ఈ నెల 7న మంత్రి సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేల సమక్షంలో వేడుకలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్​లో సుమారు 800 మంది పాల్గొనేలా జన సమీకరణ చేస్తున్నారు. సినీ గాయకురాలు మంగ్లీతో ప్రోగ్రామ్​ఏర్పాటు చేశారు. అలాగే జానపద కళారూపాలు, పేరిణి నృత్యం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీని కోసం రెండు రోజులుగా కలెక్టర్‌‌‌‌ భవేశ్‌‌‌‌ మిశ్రా అన్నారం బ్యారేజీ దగ్గర పనులను పర్యవేక్షిస్తున్నారు. బ్యారేజీకి రెండు వైపులా లైటింగ్ పెడుతున్నారు. బ్యారేజీలో నీళ్లు కనిపించేలా సెల్ఫీ వ్యూ పాయింట్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  

మేడిగడ్డలో ఉన్నది ఒక్క టీఎంసీనే.. 

లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లో అతికీలకమైనది మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ. దీని కెపాసిటీ16.17 టీఎంసీలు. మొన్నటిదాకా 8 టీఎంసీలకు పైగా నీళ్లు నిల్వ ఉండేవి. కొద్ది రోజుల కింద ఇసుక నిల్వల కోసం బ్యారేజీ గేట్లను తెరవడంతో నీళ్లన్నీ వృథాగా పోయాయి. బ్యారేజీ గేట్లకు అతి దగ్గరగా ఇసుక మేటలు తేలాయి. దీంతో 0.5 టీఎంసీకి పడిపోయింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల 
నేపథ్యంలో నీటి దినోత్సవాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో నాలుగైదు రోజుల నుంచి  ఆఫీసర్లు మేడిగడ్డ బ్యారేజీ గేట్లు వేసి పెట్టారు. ప్రాణహితలో కేవలం వెయ్యి క్యుసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో మాత్రమే ఉండడంతో పెద్దగా నీరు నిల్వ కాలేదు. అయినా, ఇప్పటికీ 1.11 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చి చేరాయి. గేట్లకు దగ్గరగా కొద్దిగా నీరు చేరినా ఇంకా ఇసుక దిబ్బలు కన్పిస్తున్నాయి. దీంతో నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తే బాగుండదని భావించిన ఆఫీసర్లు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కన్నెపల్లి పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ గతేడాది నీట మునగడం, మోటార్‌‌‌‌  రిపేర్లు పూర్తికాకపోవడంతో అక్కడ కూడా నీటి దినోత్సవం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీకి‌‌ నీటి దినోత్సవాన్ని షిఫ్ట్‌‌‌‌ చేశారు. ఈ బ్యారేజ్‌‌‌‌ కెపాసిటీ 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.51 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండటంతో సెల్ఫీ వ్యూ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బ్యారేజీ దగ్గర లేజర్‌‌‌‌ షో, ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ప్రోగ్రామ్​కలర్​ఫుల్​గా మారుతుందని భావిస్తున్నారు.