మీడియాను అనుమ‌తించ‌క‌పోవ‌డం ప‌లు అనుమానాలకు దారి తీస్తోంది

మీడియాను అనుమ‌తించ‌క‌పోవ‌డం ప‌లు అనుమానాలకు దారి తీస్తోంది
  • కోవిడ్ బులిటెన్ మాదిరిగా కూల్చివేతల‌పై బులిటెన్ ఇస్తాం: ప్రభుత్వం 
  • ప్రభుత్వ నిర్ణయం చూసి రేపు తుది తీర్పు ఇస్తాం: హైకోర్టు

హైద‌రాబాద్‌: స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేతల వద్దకు మీడియా కు అనుమతి ఇవ్వలేమని తెలంగాణ‌ ప్రభుత్వం హైకోర్టు కు తేల్చి చెప్పింది. కోవిడ్ బులిటెన్ మాదిరిగా కూల్చివేతలకు సంబంధించిన బులిటెన్ విడుదల చేస్తామని చెప్పింది. సచివాలయంలోకి మీడియాకు అనుమతించాలని ఓ పిటీషనర్ వేసిన పిటిష‌న్‌పై హైకోర్టులో శుక్రవారం విచార‌ణ జరిగింది. తమకు ప్రత్యక్ష ప్రసారాలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్టికల్ 90 ప్రకారం మీడియా స్వేచ్చకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ప్రకారం మీడియాకు పూర్తి స్వేచ్చ ఉందని తెలిపారు.

అయితే పరిస్థితుల ప్రభావంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఏజీ(ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది) కోర్టుకు తెలిపారు. అసలు ఈ కేసులో చట్టం ప్రకారం ఎలాంటి అర్హత లేదని కోర్టుకు తెలుప‌గా… ఎందుకు లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది.

సచివాలయ పరిసర ప్రాంతాలలో వెళ్లి కూల్చివేతలను కవరేజ్ చేస్తున్నమీడియాను అడ్డుకున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. స‌చివాల‌యం ఉన్న ప్రాంతంలో నిజాం నిధి ఉందని జాతీయ మీడియా లో వస్తుందన్న వార్త‌ నిజమో? కాదో? తెలియాల్సిన‌ అవసరం ఉందని అన్నారు.

ప్రయివేటు ప్రాంతాల్లో కవరేజ్ చేస్తున్న మీడియాను అడ్డుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఎందుకు ఇంత రహస్యం గా పనులు చేపడుతుందని ప్ర‌శ్నించింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం కోట్ల రూపాయల సంపద ను లైవ్ లో చూపించిన మీడియా ను ఇప్పుడు ఎందుకు మీరు కట్టడి చేస్తున్నారని అడిగింది. ప్ర‌భుత్వం మీడియాకు అనుమతి ఇస్తుందని అనుకున్నామని, అనుమతి ఇవ్వక పోవడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని కోర్టు తెలిపింది. రేపు పిటిషన్ అర్హత పై ప్రభుత్వ నిర్ణయం చూసి తుది తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను శ‌నివారానికి వాయిదా వే‌సింది.

The government's refusal to allow the media to demolish the secretariat buildings has led to many suspicions: HC