ఎక్స్ ట్రా ఫైన్‌ కట్టుకో వైన్ షాపు మళ్లీ తెరుచుకో

ఎక్స్ ట్రా ఫైన్‌ కట్టుకో వైన్ షాపు మళ్లీ తెరుచుకో
  • పెనాల్టీతో పాటు లక్షన్నర కడితే నో కేసులు
  •  మేజర్ కేసులూ రెండుమూడు రోజుల్లోనే ఎత్తివేత
  •  అక్రమాలకు దారితీస్తుందనే ఆరోపణలు

ఆదాయం కోసం ఆబ్కారీ శాఖ కొత్త మార్గాలను వెతుకుతోంది. ఎక్స్ ట్రా ఫైన్‌ కడితే అక్రమాలకు ఓకే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. నకిలీ, కల్తీ మద్యం, ఎమ్మార్పీ వయలేషన్స్ కు అవకాశమిచ్చేపోకడకు తెర తీసింది. కేసు నమోదైనా సరే.. ఎక్స్ ట్రా లక్షన్నర ఫైన్ కడితే వెంటనే దుకాణం తెరుచుకోవడానికి పర్మిషన్ ఇస్తోంది. గతంలో మేజర్ ఇష్యూలో కేసు ఫైల్ అయితే రెండు మూడు వారాల పాటు షాపు సీజ్చేసేవారు. అన్ని రోజుల ఆదాయాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుం దనే భయంతో షాపుల నిర్వాహకులు జంకేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది. లక్షన్నర ఎక్స్ ట్రా ఫైన్ కడితే వెంటనే దుకాణం తెరుచుకోవడానికి ఆబ్కారీ శాఖే పర్మిషన్ ఇస్తోంది.

గతంలో మూడు వారాలు..

రాష్ట్రవ్యాప్తంగా 2,211 వైన్షాపులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 70 నుంచి 80 కోట్ల లిక్కర్‌ సేల్‌‌ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కస్టమర్స్‌ నుంచి ఫిర్యాదులు అందడం, అధికారుల ఆకస్మిక తనిఖీలతో వైన్స్‌ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదవుతుంటాయి. చిన్న చిన్న కేసులైతే ఫైన్లుకడితే సరిపోయేది. ఎమ్మార్పీ వయలేషన్స్‌, నకిలీ, కల్తీ మద్యం అమ్మకం కేసులను సీరియస్ గా పరిగణిస్తారు. కేసు ఫైలయితే వెంటనే ఆ వైన్షాపును క్లోజ్‌ చేస్తారు. లైసెన్స్ కూడా సస్పెన్షన్‌లో పెడతరు. షాపు తెరవాలంటే ఆబ్కారీ శాఖ నుంచి రివోకేషన్లెటర్ ఉండాల్సిందే.. ఈ లెటర్ కావాలంటే రూ.2 లక్షలు కట్టి, మూడు వారాలు ఎదు రుచూస్తే తప్ప అందేది కాదు. ఒక్కోసారి వారంలోనే క్లియర్ కావచ్చు. కొన్ని సందర్భాల్లోమూడు వారాలు పట్టవచ్చు.

పెద్ద కేసులైనా రెండ్రోజులే..

ఇప్పుడేమో ఆబ్కారీ శాఖ అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పెద్దకేసులైనా రెండు రోజులకే ఎత్తేస్తున్నారు. అయితే ఫైన్‌తో పాటు అదనంగా మరో లక్షన్నర కడితే వెంటనే షాపు తెరిచి, అమ్మకాలు చేసుకోవచ్చు. అయితే సరైన కారణాలు చూపి, ఎక్స్ ట్రా ఫైన్‌ కడితే అనుమతిచ్చేందుకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్స్ ట్రా ఫైన్‌పై ఫైనల్‌‌డెసిషన్‌ ఆబ్కారీ శాఖ కమిష నర్‌ మాత్రమే తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు.

అక్రమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టే..!

ఎక్స్ ట్రా ఫైన్‌ కట్టించుకోవడం ద్వారా అక్రమాలకు ప్రభుత్వమే తలుపులు బార్లా తెరిచిందనే భావన వ్య క్తమవుతోంది. గతంలో కేసు ఫైల్‌‌అయితే క్లియర్‌ కావడానికి వారం నుంచి మూడు వారాలు పట్టేది. ఇన్ని రోజులు మద్యం దుకాణాలు కూడా బంద్‌ అయ్యేవి. ఆ రోజుల్లో రెవెన్యూ పోయేది. దీంతో ఏదైనా అక్రమాలకు పాల్పడాలన్నాఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. ఇప్పుడు ఎక్స్ ట్రా ఫైన్‌కు అవకాశం ఉండటంతో వైన్స్‌ యజమానుల్లో భయం ఎలా ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మడం, కల్తీచేయడం తదితర అక్రమాలకు అవకాశం ఉంటుందన్నారు. ఒకవేళ దొరికినా ఎక్స్ ట్రా ఫైన్ కట్టి వెంటనే షాపులు తెరుచుకుంటారని చెబుతున్నారు. అక్రమాలకు పాల్పడేటోళ్లకు ఎక్స్ ట్రా ఫైన్ కట్టడంపెద్ద కష్టమేం కాదంటున్నారు.

వాళ్లకో రూల్‌.. వీళ్లకో రూలా..?

అధికారులు ఒక్కోదగ్గ ర ఒక్కోరూల్‌‌ పాటిస్తున్నారని వైన్షాపుల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ని 30 వైన్స్ లపై ఎక్సైజ్‌ అధికారులు కేసులు నమోదు చేసి, లైసెన్స్ సస్పెండ్ చేశారు. రిజిస్టర్లు సరిగాలేవని, శానిటైజర్‌ అందుబాటులో లేదని, ఫిజికల్‌ ‌డిస్టెన్స్‌, పరిశుభ్రత పాటించడంలేదని, సీసీ కెమెరాలు లేవని, ఫ్రిడ్జిలపై కంపెనీల లేబుళ్లు ఉన్నాయని చిన్నచిన్న కారణాలతోనే లైసెన్స్ సస్పెండ్ చేశారు. ఆ వెంటనే వైన్స్ క్లోజ్‌చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న ఓ వైన్స్ పై ఎమ్మార్పీ కేసు నమోదైనా షాపును వెంటనే మూసేయలేదు. ఎమ్మార్పీ వయలేషన్స్ నమోదైనా సరే పంజాగుట్టలోని ఓ వైన్షాపును క్లోజ్ చేయలేదు. సోమవారం రాత్రి వరకూ ఎలాంటి సస్పెన్ష న్‌ ఆర్డర్ రాలేదని తెలిసింది. సంబంధిత అధికారులను అడిగితే అంతా ఉన్నతాధికారుల చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు

ఆదాయమే లక్ష్యంగా..

రాష్ట్రానికి ఆదాయం తెచ్చే వనరుల్లో ఎక్సైజ్‌ శాఖ కీలకమైంది. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాల నుంచి వచ్చే ఆదాయం పడిపోయింది. ఇటీవల లిక్కర్‌ రేట్లుపెంచినా.. ఆబ్కారీ శాఖ నుంచి పెద్దగా ఆదాయం రావడంలేదు. దీంతో ఇటీవల వరుసగా తనిఖీలు చేపట్టి, ఫైన్ల రూపంలో ఆదాయం పొందాలని చూస్తున్నారు. గతంలో పట్టించుకోని చిన్న అంశాలు, కారణం వెతికి మరీ కేసులు పెడుతున్నారని నిర్వాహకులు వాపోతున్నారు.