రిక్రూట్​​మెంట్​.. రిటైర్మెంట్​ కానిస్టేబుల్​గానే

రిక్రూట్​​మెంట్​.. రిటైర్మెంట్​  కానిస్టేబుల్​గానే
  • సివిల్ వింగ్​లో 1991 నుంచి నో ప్రమోషన్​
  • స్టేట్ లో 5వేల హెడ్​ కానిస్టేబుల్​ పోస్టులు ఖాళీ
  • కేసుల సాకుతో ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్​

నారాయణ 1991 లో సివిల్ కానిస్టేబుల్ గా సెలక్టయ్యిండు. 30 ఏండ్ల సర్వీస్ కంప్లీటైంది. కానీ ఇంకా కానిస్టేబుల్ గానే పని చేస్తున్నాడు. అతనితోపాటే సెలక్టయిన  ఏఆర్, స్పెషల్​ పోలీసు కానిస్టేబుళ్లు మాత్రం  ప్రమోషన్లు వచ్చి ఆఫీసర్లు అయ్యారు. ముప్పైఏండ్లైనా ఎటువంటి ప్రమోషన్లు లేక మానసిక వేదన అనుభవిస్తున్నాడు. ”

రమేశ్ 1991 లో రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో జూనియర్ అసిస్టెంట్ గా చేరాడు. ఆ తరవాత మూడు సార్లు ప్రమోషన్లు వచ్చాయి. మొదట  సీనియర్ అసిస్టెంట్​గా,  ఆ తర్వాత  డిప్యూటీ తహసీల్దార్​గా, కొంతకాలానికి తహసీల్దార్​గా ప్రమోట్​ అయ్యాడు.  రేపో మాపో మరో ప్రమోషన్ దక్కనుంది.  ”

ఒకరు హోం డిపార్ట్​మెంట్​లో .. మరొకరు  రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో ఒకే ఏడాది  కొలువులో చేరారు.  సివిల్ కానిస్టేబుల్ అదే క్యాడర్ లో ఉండగా..  రెవెన్యూ ఎంప్లాయ్​ మాత్రం గెజిటెడ్ ఆఫీసర్​ హోదాకు చేరుకున్నారు.

కరీంనగర్, వెలుగు:

ఏ గవర్నమెంట్​ ఆఫీసులో అయినా ఇప్పుడు ఒక్కటే చర్చ. మీ డిపార్ట్ మెంట్ లో ప్రమోషన్లు సంగతేందీ.. నీ కు ప్రమోషన్​ వస్తుందా.. అన్న మాటలే వినిపిస్తున్నాయి. కానీ..  పోలీసు కానిస్టేబుళ్లు మాత్రం తీవ్ర నిరాశతో ఉన్నారు. సివిల్​ విభాగంలో కానిస్టేబుల్​గా చేరిన వారెవరికీ 30 ఏళ్లుగా ఒక్క ప్రమోషన్​కూడా రాలేదు. చాలామంది కానిస్టేబుల్​గానే రిటైర్​ అవుతున్నారు.  స్టేట్​లో 5వేలకు పైగా  హెడ్ కానిస్టేబుల్​ పోస్టులు ఖాళీగా  ఉన్నా.. కోర్టు కేసులు ఉన్నాయంటూ ప్రమోషన్​ ప్రక్రియ నిలిపివేశారు. దీంతో ఈసారి కూడా ప్రమోషన్లు లేనట్టేనని పోలీసులు నిరాశ చెందుతున్నారు.

అర్హతలున్నా..

తెలంగాణలో సుమారు 40వేల మంది సివిల్ కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. ఇందులో 5వేల మంది వరకు హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు ప్రమోషన్​ ఇవ్వడానికి అర్హత ఉన్నవారే. పోస్టులు కూడా ఖాళీగా ఉండడంతో చాలామంది ఈసారి ప్రమోషన్​ వస్తుందని ఆశపడ్డారు.  డిపార్ట్​మెంట్​లోని అన్ని విభాగాల్లో ప్రమోషన్ల ప్రక్రియ మొదలుపెట్టాలని డీజీపీ ఆఫీసు నుంచి సర్క్యులర్ కూడా జారీ అయ్యింది. అయితే కానిస్టేబుళ్ల ఆశలను సర్కారు నీరుగార్చింది. కోర్టులో కేసులున్నాయంటూ కానిస్టేబుళ్ల ప్రమోషన్లను ఆపేసింది. 1990 బ్యాచ్​ వాళ్లకు మాత్రమే చివరిసారి ప్రమోషన్లు వచ్చాయి. 1991 తర్వాత రిక్రూట్​ అయిన సివిల్​ కానిస్టేబుళ్లకు ఇప్పటివరకు ఒక్క ప్రమోషన్​ కూడా రాలేదు. ఇతర డిపార్టమెంట్లలో తమతో పాటు జాయిన్​వారు పెద్ద పొజిషన్​లో ఉండగా.. తాము మాత్రం ఎక్కడికక్కడే మిగిలిపోవాల్సివచ్చిందని బాధ పడుతున్నారు. సొంత డిపార్ట్​మెంట్​లో కూడా ఏఆర్, స్పెషల్​ పోలీసు విభాగాలకానిస్టేబుళ్లకు మాత్రమే ప్రమోషన్లు దక్కుతున్నాయి. ఏఆర్ లో  1998 వరకు ఎంపికయిన వారికి, ఎస్పీ విభాగంలో   2018 వరకు రిక్రూట్​ అయినవారికే ప్రమోషన్లు వచ్చాయి.

ఏందీ కిరికిరి..

పోలీసు డిపార్ట్​మెంట్​లో టీఎస్ ఎస్పీ, ఏఆర్, సివిల్ అన్న మూడు విభాగాల్లో  కానిస్టేబుళ్ల భర్తీ జరుగుతుంది. టీఎస్ ఎస్పీ, ఏఆర్ లలో రిక్రూట్ అయిన వారిలో కొందరిని సివిల్ విభాగానికి మారుస్తుంటారు. ఇలా కన్వర్షన్ అయిన వారికి అనుభవం ఎక్కువగా ఉండడంవల్ల డైరెక్టుగా రిక్రూట్​ అయిన సివిల్ కానిస్టేబుళ్ల కన్నా ముందుగా ప్రమోషన్లు వస్తున్నాయి. దీనివల్ల  సివిల్ కానిస్టేబుళ్లకు సినియారిటీ ఉన్నా ప్రమోషన్​ లిస్టులో వెనకబడిపోతున్నారు. ఈ అంశం మీద సివిల్ కానిస్టేబుళ్లు  కోర్టులో కేసు వేశారు.  మూడేళ్ల నుంచి ఈ  కేస్ నడుస్తుంది. దీంతో అప్పటి నుంచి కానిస్టేబుళ్ల ప్రమోషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఏపీలో కేసులు ఉన్నా 2004 బ్యాచ్​ వరకు ప్రమోషన్లు ఇచ్చేశారు. రెండు పార్టీలతో మాట్లాడి ఇరువురి సమ్మతితో ప్రమోషన్లు క్లియర్​ చేశారు.  తెలంగాణ గవర్నమెంట్​ కూడా ఈ దిశగా చొరవ చూపాలని  కోరుతున్నారు. ఈ నెల 20న కేసు  బెంచ్ మీదకు వస్తుంది. మరి ఈ సారైనా తమకు  అనుకూలంగా జడ్జిమెంట్​ వస్తుందని సివిల్​ కానిస్టేబుళ్లు ఆశపడుతున్నారు.