తెలంగాణలో 1.30లక్షల మంది ఎయిడ్స్ రోగులున్నారు

తెలంగాణలో 1.30లక్షల మంది ఎయిడ్స్ రోగులున్నారు
  • ఎయిడ్స్ రోగులకు ఉచిత వైద్యం.. 2వేలు పెన్షన్ ఇస్తున్నాం
  • ఎయిడ్స్ రోగుల కోసం హైదరాబాద్, వరంగల్ లో ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణలో 1.30లక్షల మంది ఎయిడ్స్ రోగులున్నారని, 70 వేల మందికి మందులు అందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఎయిడ్స్ రోగులకు ఉచిత వైద్యంతోపాటు నెలకు  2వేలు పెన్షన్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఎయిడ్స్ రోగుల కోసం హైదరాబాద్, వరంగల్ లో ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని హరీష్ రావు వివరించారు. బుధవారం ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో జరిగిన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మరణాల సంఖ్య తగ్గించగలిగామన్నారు. ఎయిడ్స్ రోగుల పట్ల చిన్న చూపు చూడొద్దని ఆయన సూచించారు. గాలి ద్వారా, తాకడం ద్వారా ఎయిడ్స్ రాదని, ఎయిడ్స్ రాకుండా అవగాహన పెంచుదామన్నారు. చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో త్వరలో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రి పేద ప్రజలకు అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. నర్సింగ్ వృత్తిలో ఉన్న విద్యార్థులకు నెలనెలా స్టైఫండ్ అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు చెప్పారు.