బీఆర్​కే భవన్ లో జాగా లేదు..సౌలతుల్లేవు

బీఆర్​కే భవన్ లో జాగా లేదు..సౌలతుల్లేవు

తాత్కాలిక సచివాలయం బీఆర్​కే భవన్​పై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. చాలీచాలని జాగాలో, కనీస సౌకర్యాలు లేకుండా ఎట్ల పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. అక్కడి పరిస్థితుల్లో తాము డ్యూటీ చేయలేమంటున్నారు. త్వరలోనే సీఎస్​ ఎస్​కే జోషిని కలిసి తమ సమస్యలు, ఇబ్బందులను చెప్పుకుంటామని అంటున్నారు. పార్కింగ్​, బాత్రూంలు, క్యాంటీన్​ వంటి సౌకర్యాలు సరిగ్గా లేవని, వాహనాల సౌండు, హుస్సేన్​సాగర్​ కాలుష్యం వంటివి ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వెంటిలేషన్​ కూడా సరిగ్గా లేదని ఆరోపిస్తున్నారు. బీఆర్​కే భవన్​లో అన్ని శాఖలకూ సరిపడా స్థలం లేదని, కాబట్టి సిటీలోని ఆయా శాఖల హెచ్​​వోడీ ఆఫీసులకు తమను షిఫ్ట్​ చేయాలని కోరుతున్నారు. సెక్రటేరియట్​ వైశాల్యం 4 లక్షల చదరపుటడుగులు కాగా, బీఆర్​కే భవన్​ వైశాల్యం కేవలం 1.69 లక్షల చదరపుటడుగులేనని అధికారులు చెబుతున్నారు. ఇరికిరుకు గదుల్లోకి శాఖలను షిఫ్ట్​ చేయడంపై అభ్యంతరం చెబుతున్నారు.

ఓ వైపు పనులు, మరో వైపు డ్యూటీ

ఓ వైపు సెక్రటేరియట్​ షిఫ్టింగ్​ వేగంగా సాగుతోంది. బుధవారం పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, హోం శాఖ, జీఏడీ, నీటిపారుదల శాఖల షిఫ్టింగ్  జరిగింది. ఆయా శాఖలకు బీఆర్​కే భవన్​లో కేటాయించిన ఫ్లోర్లకు ఆయా శాఖల ఫర్నీచర్​, ఫైళ్లు ఇతర సామాన్లను తీసుకెళ్లారు. అయితే, మరమ్మతులు మొత్తం పూర్తయి వాటిని సర్దడానికే చాలా టైం పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఓ వైపు పనులు జరుగుతుండగానే మరో వైపు అధికారులు, ఉద్యోగుల డ్యూటీ కూడా నడుస్తూనే ఉంది. బీఆర్​కే భవన్​లోని తొమ్మిదో అంతస్తులోకి సీఎస్​ ఆఫీసు, జీఏడీ శాఖలు ఇప్పటికే వెళ్లాయి. సీఎస్​ చాంబర్​కు ఇప్పటికే ఆధునీకరణ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఈ వారం చివరి నాటికి ఆ పనులు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్​ సిన్హా, జీఏడీ ప్రొటోకాల్ సెక్రటరీ అర్విందర్​ సింగ్​, డిప్యూటీ సెక్రటరీ చిట్టిరాణి ఇప్పటికే ఆ ఫ్లోర్​లోనే తమ తమ చాంబర్లలో పనుల్లో మునిగిపోయారు. వారితో పాటు మరో 50 మంది ఉద్యోగులూ పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా అక్కడకు తీసుకొచ్చిన సామానంతా కారిడార్లలోనే పెట్టడం, రెనోవేషన్​ చేస్తుండడంతో దుమ్మూ, ధూళి ఎక్కువగా ఉంది. ఆ పరిస్థితుల్లోనే డ్యూటీలు చేస్తున్నారు.

ఈటల పేషీ పరిశీలన

బుధవారం బీఆర్​కే భవన్​లోని మొదటి ఫ్లోర్​ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఓఎస్డీ చంద్రకాంత్​రెడ్డి, అధికారులు పరిశీలించారు. ఆయన పేషీలో చేయాల్సిన పనులు, మార్పులు, మరమ్మతులపై రోడ్లు భవనాల శాఖ, విద్యుత్​శాఖ అధికారులతో చర్చించారు. నేడో రేపో ఆయన చాంబర్​కు మరమ్మతులు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

బోసిపోయిన సెక్రటేరియట్​

కొద్ది రోజులుగా షిఫ్టింగ్​ జరుగుతుండడం, చాలా శాఖలు బీఆర్​కే భవన్​కు షిఫ్ట్​ అవ్వడంతో ఉన్నతాధికారులు, మంత్రులు సెక్రటేరియట్​కు రావడం లేదు. దీంతో కారిడార్లన్నీ బోసిపోతున్నాయి. ఇన్​వార్డ్​ సెక్షన్​ ఈ నెల చివరి వరకు బంద్​ అంటూ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు అందడంతో వాళ్లు రావట్లేదు. ఇటు ఎప్పుడూ సందర్శకుల తాకిడితో కళకళలాడే సచివాలయం, వాళ్ల రాక తగ్గడంతో వెలవెలబోతోంది. కొందరు ఉద్యోగులు ఫైళ్లు సర్దడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. కొన్ని శాఖల్లో ఉద్యోగుల హాజరు శాతం కూడా చాలా తక్కువగా ఉంది. కొందరు ఉన్నతాధికారులు ఇంటి దగ్గరే పనిచేస్తున్నారు. ఇక, సెక్రటేరియట్​ షిఫ్టింగ్​ నాటి నుంచి బీఆర్​కే భవన్​లో ఎలా పనిచేయాలని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. 1983లో కట్టిన ఆ బిల్డింగ్​లో ఇప్పటిదాకా 800 మంది ఉద్యోగులు పని చేశారని, సెక్రటేరియట్​ మొత్తం షిఫ్ట్​ అయిపోతే ఇప్పుడు పనిచేసే ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని అనుకుంటున్నారు. ఉద్యోగులు, పోలీసులు, మీడియా, సందర్శకులు, రోజూ మంత్రుల దగ్గరకు వచ్చి వెళ్లే ప్రజాప్రతినిధులతో రద్దీ ఎక్కువ అవుతుందని చర్చించుకుంటున్నారు. ఇంత మంది వచ్చిపోతుంటే అసలు బీఆర్​కే భవన్​ ఉంటుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెక్రటేరియట్​ను కూల్చేయాలన్న ఆలోచనే తప్పని మాట్లాడుకుంటున్నారు.