ఊర్లల్ల గడ్డి కొరత

ఊర్లల్ల గడ్డి కొరత
  • రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో గడ్డి కొరత ఏర్పడింది.
  • ఒక్క గడ్డి మోపు ధర రూ.100 వరకు పలుకుతోంది
  • ట్రాక్టరు ఎండుగడ్డి కొనాలంటే కూలి, కిరాయి
  • ఖర్చులతో కలిపి రూ.10 వేలు దాటుతోంది

హైదరాబాద్, వెలుగు: ఎండు గడ్డే కదా అని వదిలేసే రోజులు పోతున్నాయి. ఒకప్పుడు వరి పొలాల కోత తర్వాత గడ్డి అలాగే వదిలేసి.. దున్నకాలకు ముందు కాలబెట్టేవారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో గడ్డి కొరత తీవ్రమవుతోంది. హార్వేస్టర్లతో వరి కోయిస్తుండటంతో సగానికి సగం గడ్డి తరుగు పోతోంది. కూళ్లు పెట్టి వరి కోయించి, పడుగు పెట్టి తొక్కించే రైతులు తగ్గిపోయారు. దీంతో పశువుల పెంపకందారులు, పాడి రైతులకు గడ్డి సమస్య మొదలైంది. ఎక్కడా ఎండు గడ్డి దొరికే పరిస్థితి లేదు. ఎక్కడైనా రైతుల దగ్గర ఉంటే అధిక ధరకు కొనాల్సి వస్తోంది. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు, వరదల కారణంగా వరి పొలాలు నీట మునిగాయి. కోతలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. గడ్డి బాగా దెబ్బతిన్నది. మరోవైపు ప్రభుత్వ ప్రకటనతో యాసంగిలో వరి సాగుపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. దీంతో ముందు చూపుతో భారీగా గడ్డిని నిల్వ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ట్రాక్టర్​గడ్డికి వేలల్లో..
రాష్ట్రంలో ఏటా మార్చి నుంచి ట్రాక్టర్లలో గడ్డి లోడ్లు ఊర్లకు అమ్మేందుకు వచ్చేవి. ఒక్క కట్ట రూ.25 వరకు అమ్మేవారు. ఈ ఏడాది చాలా చోట్ల ఇంకా పొలాలు కోయకపోవడం, కోసిన ప్రాంతాల్లో గడ్డి పాడవడంతో ఎవరూ అమ్మడం లేదు. దీంతో ఒక్క గడ్డి మోపు ధర రూ.50 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. నిరుడు ఎకరం విస్తీర్ణం వెయ్యి రూపాయలు ఉంటే ఇప్పుడది రూ.3 వేలకుపైగా పలుకుతోంది. ట్రాక్టరు ఎండు గడ్డి రూ.10 వేలు దాటుతోంది. 
గడ్డి పనికి రావడం లేదు..
గత రెండు మూడెండ్లుగా కూలీలతో పొలాలు కోయించడం బాగా తగ్గిపోయింది. కొంచెం వరి పెట్టిన రైతులు కూడా హార్వెస్టర్లతోనే కోయిస్తున్నారు. హార్వెస్టర్​తో పొలాలు కోయడం వల్ల గడ్డి సగానికి సగం తగ్గి పోతంది. కొంత పాడవుతోంది. మిషన్​తో పొలం కోసిన తర్వాత గడ్డి ఒక దగ్గరకు చేయడం, వాము పెట్టేందుకు ఖర్చు అవుతోంది. దీంతో రైతులు గడ్డి అలాగే వదిలేసి.. కాలబెడుతున్నారు. ఈ ఏడాది పొలాలు కోసే టైమ్​కు వర్షాలు రావడంతో టైర్లతో ఉన్న వరి కోత మిషన్లు పొలాల్లో దిగబడుతున్నాయి. దీంతో చైన్ హార్వెస్టర్లతో పొలాలు కోపిస్తున్నారు. ఈ మిషన్​తో కోయడం వల్ల గడ్డి పనికిరాకుండా పోతోంది. దీంతో గడ్డి కొరత  ఏర్పడింది. పంట దిగుబడికి వచ్చిన డబ్బులు గడ్డి కొనేందుకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని పలువురు రైతులు అంటున్నారు. 

పశువులున్నయి.. గడ్డి లేదు
నాకు బర్లు, ఎడ్లు కలిపి 10 పశువులు ఉన్నయి. వానలు బాగపడి పొలం ఆరకపోవడంతో నా మూడెకరాల పొలం చైన్ మిషన్​తో కోయించిన. మిషన్​ కింద నలిగింది పోగా.. కొంత గడ్డి దగ్గరకు చేస్తే 100 కట్టలు వచ్చింది. ఈ గడ్డి నా బర్లు, ఎడ్లకు ఎక్కడ సరిపోతది. బయట కూడా ఎక్కడా దొరుకుత లేదు. యాసంగిలో వరి వేయొద్దని సర్కారు అంటోంది. అట్లయితే గడ్డికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. 
                                                                                                                                                                                - వెంకటరెడ్డి , రైతు ఖమ్మం జిల్లా