బ్యాక్టీరియాతో బొమ్మలు గీశారు

బ్యాక్టీరియాతో బొమ్మలు గీశారు

 

మామూలుగా బొమ్మ గీయాలంటే పేపరు, పెన్సిల్​ కావాలి. అదే కేన్వాస్​ మీద అయితే కుంచె, కలర్లు కావాలి. కానీ, అవేవీ లేకుండా కొంచెం కొత్తగా బొమ్మ గీస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఈ బొమ్మల్లో కొత్తదనం అదే. ఏ రంగులు, కుంచె లేకుండానే వీటిని గీశారు. ‘బ్యాక్టీరియా’తో ఈ బొమ్మలను చెక్కారు. అమెరికన్​ సొసైటీ ఆఫ్​ మైక్రోబయాలజీ (ఏఎస్​ఎం) గత ఐదేళ్లుగా ‘అగార్​ (బ్యాక్టీరియా బతికేందుకు అవసరమయ్యే ఓ ప్రొటీన్​) ఆర్ట్​ పోటీ’లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోటీలకు వచ్చిన ఫొటోలివి. సైంటిస్ట్​ (ప్రొఫెషనల్), నాన్​సైంటిస్ట్​ (మేకర్​), చిల్డ్రెన్​ కేటగిరీల్లో 347 ఎంట్రీలొచ్చాయి. ఆ ఎంట్రీల్లోకెల్లి నవంబర్​ 20న విజేతలను ప్రకటించారు ఏఎస్​ఎం జడ్జిలు. ప్రొఫెషనల్​ కేటగిరీలో కోయి ఫిష్​ అండ్​ లోటస్​ ఫ్లవర్​ బొమ్మ గీసిన ఓక్లాండ్​ యూనివర్సిటీ సైంటిస్ట్​ అర్వా హదీద్​ ఫస్ట్​ ప్రైజ్​ గెలుచుకున్నారు. పీపుల్స్​ చాయిస్​ అవార్డు సిన్​ల్యాబ్​ హంగరీ లిమిటెడ్​కు చెందిన జిటా పోస్తెన్యీ గీసిన హంగేరియన్​ ఫోక్​ ఆర్ట్​, మేకర్​ కేటగిరీలో కోరే అబ్రామ్​ గీసిన బ్యాక్టీరియల్​ సెల్ఫ్​ పోట్రెయిట్​,  చిల్డ్రెన్​ కేటగిరీలో కేట్​ లిన్​ గీసిన ద సర్కిల్​ ఆఫ్​ లైఫ్​ను వరించింది.

ఎట్ల మొదలైంది..?

సోషల్​ మీడియాలో ప్రారంభమైన పిక్​ ఆఫ్​ ద డే సిరీస్​లో భాగంగా ఏఎస్​ఎం అగార్​ ఆర్ట్​ కంటెస్ట్​ మొదలైంది. 2014 డిసెంబర్​లో రోసిత్స తశ్కోవా అనే వ్యక్తి అగార్​ ప్లేట్​లో బ్యాక్టీరియాతో గీసిన బొమ్మ, సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో ఏఎస్​ఎం ఈ పోటీల ఆలోచన చేసింది. ఆ తర్వాత ఎండా కాలానికే పోటీలను మొదలుపెట్టారు. సైంటిస్టులు క్రియేటివ్​గా కూడా ఆలోచించగలరని ప్రపంచానికి నిరూపించేందుకే ఈ పోటీలు పెట్టినట్టు ఏఎస్​ఎం పబ్లిక్​ అవుట్​రీచ్​ మేనేజర్​ కేథరీన్​ లోంటోక్​ తెలిపారు. తొలి ఏడాది పెట్టిన పోటీలకు 84 ఎంట్రీలొచ్చాయన్నారు. అప్పటి నుంచి ఎంట్రీలు పెరుగుతున్నాయన్నారు. త్రీడీ అగార్​ టెక్నిక్​లో బ్యాక్టీరియాతో మంచి బొమ్మలు గీసి పంపుతున్నారని చెప్పారు.

ఎట్ల గీస్తరు?

మిగతా బొమ్మలు, పెయింటింగ్స్​తో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్​ వ్యవహారం. బ్యాక్టీరియాతో బొమ్మలు గీయాలంటే ముందే ప్లానింగ్​ ఉండాలి. కంపోజిషన్​, బ్యాక్టీరియా పెరుగుదలకు ఉపయోగపడే మీడియం, కలర్ల ఎంపిక బాగుండాలి. మామూలు బొమ్మల్లాగా గీయగానే ఆ బొమ్మ కనిపించేయదు. కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే దాని వెనక చాలా ప్రాసెస్​ ఉంటుంది మరి. మామూలుగా మైక్రోబయాలజీ ల్యాబుల్లో పెట్రి డిష్​లలో బ్యాక్టీరియాను పెంచుతుంటారు. దానికి అగార్​ను తీసుకుని ఉడికిస్తారు. దానిని పెట్రి డిష్​లలో పోసి జెల్​లాగా మారే వరకు వేచి చూస్తారు. ఆ తర్వాత బ్యాక్టీరియాను దాంట్లోకి ఇనాక్యులేట్​ చేస్తారు. ఆ తర్వాత అందులో బ్యాక్టీరియా వృద్ధి చెంది కాలనీలుగా ఏర్పడడానికి రెండు రోజుల వరకు టైం పడుతుంది. ఈ బొమ్మలు గీయడమూ అంతే. అయితే, బ్యాక్టీరియాను ఇనాక్యులేట్​ చేసేటప్పుడు, ఏదో చేశాంలే అని కాకుండా గీయాలనుకుంటున్న బొమ్మను బ్యాక్టీరియాతో కరెక్ట్​గా ఇనాక్యులేట్​ చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాక్టీరియాలు సహజంగానే రంగులతో ఏర్పడుతుంటాయి. వేరే కలర్లు కావాలంటే అందుకు తగ్గ బ్యాక్టీరియాను ఎంచుకోవాల్సి ఉంటుంది. స్ట్రెప్టోమైసిస్​ (బ్లూ, గ్రీన్), ఈ–కొలి (మట్టి రంగు), మట్టిలో ఉండే వివిధ బ్యాక్టీరియాలు పర్పుల్​, యెల్లో రంగులను ఇస్తుంటాయి. రంగులకు తగ్గట్టు ఆర్టిస్టులు ఆయా బ్యాక్టీరియాలను ఎంచుకుని ఈ బొమ్మలు గీశారు.