గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పై సర్కార్ దృష్టి

గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పై సర్కార్ దృష్టి
  • మొదట జులై లేదా ఆగస్టులో పెడ్తామన్న టీఎస్ పీఎస్సీ
  • ప్రిపరేషన్ కు టైమ్ ఇవ్వాలని అధికారుల యోచన 
  • ముగిసిన అప్లికేషన్ల గడువు... 3.80 లక్షల మంది దరఖాస్తు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 అప్లికేషన్ల గడువు శనివారంతో ముగియడంతో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏర్పాట్లపై టీఎస్ పీఎస్సీ దృష్టిసారించింది. జులై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు దాన్ని మార్చాలని అధికారులు యోచిస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎగ్జామ్ పెట్టాలని భావిస్తున్నారు. ప్రిపరేషన్ కోసం అభ్యర్థులకు టైమ్ ఇచ్చేందుకే ఈ ఆలోచన చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 26న 503 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. మే 2 నుంచి  దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అదే నెల 31తో దరఖాస్తులకు గడువు ముగియగా, అభ్యర్థుల కోరిక మేరకు ఈ నెల 4 వరకు టీఎస్ పీఎస్సీ అధికారులు గడువు పొడిగించారు. జులై 31న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించాలని భావించారు. కానీ చాలా ఏండ్ల తర్వాత గ్రూప్ 1 నిర్వహిస్తుండడం, బుక్స్ అందుబాటులో లేక ప్రిపరేషన్ కు ఇబ్బందులు ఎదురవడం, మరింత టైమ్ కావాలని అభ్యర్థులు కోరుతుండడంతో ఎగ్జామ్ ను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు. 

వీలైతే సెప్టెంబర్​లోనే... 

ఆగస్టులో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు రాత పరీక్షలు ఉన్నాయి. వీటికి దాదాపు 13 లక్షల మంది పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్థుల ప్రిపరేషన్​కు గ్రూప్1 అడ్డంకిగా మారొద్దని, ప్రిలిమ్స్ ఎగ్జామ్ వేరే నెలలో పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. సెప్టెంబర్16 నుంచి సివిల్స్ మెయిన్ ఎగ్జామ్స్ ఉండగా, అదే నెల ఫస్ట్ వీక్​లో బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరోపక్క బతుకమ్మ పండుగ ఉంది. వీటికి తోడు ఇంకా వివిధ ఎంట్రెన్స్, పోటీ పరీక్షల తేదీలనూ అధికారులు పరిశీలిస్తున్నారు. అవకాశముంటే సెప్టెంబర్ లో  లేదంటే అక్టోబర్​లో ప్రిలిమ్స్ పెట్టాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే  మెయిన్ ఎగ్జామ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. కోచింగ్ సెంటర్ల ఒత్తిడితోనే ప్రిలిమ్స్ ను వాయిదా వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

మస్తు అప్లికేషన్లు.. 

గ్రూప్ 1 అప్లికేషన్ల గడువు శనివారం అర్ధరాత్రితో ముగిసింది. రాత్రి 8 గంటల వరకు 3,80,202 దరఖాస్తులు అందాయి. గత నెల 31తోనే గడువు ముగియగా, గడువు పెంచినంక మరో 30 వేల దరఖాస్తులు వచ్చాయి. కాగా 1,95,179 మంది కొత్తగా టీఎస్ పీఎస్సీ ఓటీఆర్​ క్రియేట్ చేసుకోగా.. 3,92,156 మంది పాత ఓటీఆర్​ను అప్​డేట్ చేసుకున్నారు.