రిటైర్మెంట్ వ‌య‌స్సు వచ్చేసరికి కూడా ఉద్యోగాలు వచ్చేలా లేవు

రిటైర్మెంట్ వ‌య‌స్సు వచ్చేసరికి కూడా ఉద్యోగాలు వచ్చేలా లేవు

హైదరాబాద్: హిందీ లాంగ్వేజ్ పండితుల ఫలితాలు వెంటనే ప్రకటించి, పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నాంపల్లిలోని టీఎస్పీఎస్సి కార్యాలయాన్ని నిరుద్యోగ జేఏసీ ముట్టడించారు. పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌కుండా.. ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ని ముట్టడిలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్. క్రిష్ణ‌య్య విమ‌ర్శించారు.

రాష్ట్రంలో ఏ ఆఫీసుకు వెళ్లినా, ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయ‌ని, దాదాపు 2.5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. 10 ఏండ్ల నుండి గ్రూప్ 1 లేదని  మండిపడ్డారు. నిరుద్యోగులు గడ్డాలు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతున్నారని , వారికి పదవీవిరమణ వయసు వచ్చేసరికి కూడా ఉద్యోగాలు వచ్చేలా లేవని విమర్శించారు.

TSPSC ఒక రబ్బరు స్టాంప్ అయిపోయిందని , ఆ ఆఫీస్ లోనే ఖాళీలు ఉన్నాయి…ఇక ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారని ప్ర‌శ్నించారు. 2017 టీఆర్టీ హిందీ పండితుల నియామకాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం వెల్ల‌డించకుండా నిర్లక్ష్యం చేస్తోందని, తక్షణమే పెండింగ్ సమస్యలు క్లియర్ చేయాలన్నారు. లేదంటే TSPSC ని నిర్బంధిస్తామ‌ని కృష్ణ‌య్య అన్నారు.